ట్విట్టర్‌లో ముఖ్యమంత్రికి జగన్‌ సవాల్‌

అమరావతి: ‘ప్రత్యేకహోదా విషయంలో మీరు చేసిన ద్రోహంపై సమాధానం చెప్పే నైతిక ధైర్యం మీకుందా…’ అని వైకాపా అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు సవాల్‌ చేశారు. ఈ మేరకు సోమవారం రాత్రి ట్విట్టర్‌లో ట్విట్‌ చేశారు. ‘‘2014 ఏప్రిల్‌ 30న నరేంద్రమోదీ, చంద్రబాబు, వారి మిత్రులు రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇస్తామని హామీనిచ్చారు. చంద్రబాబు ఎన్నికల ముందు 15ఏళ్లు ప్రత్యేకహోదా కావాలన్నారు. అధికారంలోకి వచ్చాక గత నాలుగేళ్లలో హోదా డిమాండ్‌ను పాతాళంలోకి తొక్కేసేందుకు అవసరమైనవన్నీ చేశారు. ఇప్పుడు మళ్లీ ప్రజలను మోసం చేసేందుకు కొత్త నాటకానికి తెరతీశారు’’ అని పేర్కొన్నారు. వైకాపా విశాఖలో నిర్వహించిన ‘వంచన వ్యతిరేక దీక్ష’ సభకు ప్రజాస్పందన బాగా లభించిందన్నారు.