తల్లిదండ్రులను వొదిలివేస్తి ఆరు నెలల జైలు శిక్ష

వృద్ధాశ్రమాలు పెరిగిపోతున్న తరుణంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం వృద్ధ తల్లిదండ్రులకు మేలు చేసేందుకు ప్రయత్నిస్తోంది. తల్లిదండ్రులను వృద్ధాప్యంలో వదిలేయడం కానీ, దుర్మార్గంగా దూషించడం కానీ చేసే సంతానానికి ఆరు నెలల జైలు శిక్ష విధించే విధంగా చట్టాన్ని సవరించాలని భావిస్తోంది. ప్రస్తుత చట్టాల ప్రకారం ఈ నేరానికి మూడు నెలలు జైలు శిక్ష విదించే అవకాశం ఉంది.

కేంద్ర సాంఘిక సంక్షేమం, సాధికారత మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపిన వివరాల ప్రకారం తల్లిదండ్రులు, వృద్దుల పోషణ, సంక్షేమం చట్టం, 2007ను ప్రభుత్వం సమీక్షిస్తోంది. ఈ చట్టంలోని పిల్లలు అనే పదానికి నిర్వచనాన్ని విస్తృతపరచేందుకు ప్రతిపాదించింది. దత్తతకు వచ్చిన పిల్లలు, సవతి పిల్లలు, అల్లుళ్ళు, కోడళ్ళు, మనుమలు, మనుమరాళ్ళు, చట్టబద్ధమైన సంరక్షకుల సంరక్షణలో ఉన్న మైనర్లను కూడా పిల్లలుగా పరిగణించేవిధంగా ఈ చట్టాన్ని సవరించాలని ప్రతిపాదించింది. నెలవారీ పోషణ భత్యం పరిమితిని రూ.10,000ను రద్దు చేయాలని ప్రతిపాదించింది. దీనివల్ల పోషణ భత్యం పెరగవచ్చు. ఈ సవరణలతో కేంద్ర సాంఘిక సంక్షేమం, సాధికారత మంత్రిత్వ శాఖ ‘‘తల్లిదండ్రులు, వృద్ధుల పోషణ, సంక్షేమ ముసాయిదా బిల్లు, 2018’’ని రూపొందించింది.

ప్రస్తుతం అమల్లో ఉన్న చట్టం ప్రకారం పిల్లలు అనే పదం నిర్వచనం పరిథిలోకి జీవసంబంధ పిల్లలు, మనుమలు మాత్రమే వస్తారు.