తాజాగా ఓ ట్వీట్ తో బాలీవుడ్‌… రిషి కపూర్‌

 

ముంబయి: అలనాటి బాలీవుడ్‌ నటుడు రిషి కపూర్‌ సోషల్‌ మీడియాలో చాలా చురుగ్గా ఉంటారు. మ్యాచ్‌లు, సినిమాలు, రాజకీయ అంశాల గురించి ట్వీట్లు పెడుతుంటారు. రిషి చేసే ట్వీట్లు గిట్టనివారు ఏదో ఒక కామెంట్‌ పెట్టడం దానికి ఈయన దీటుగా సమాధానం ఇవ్వడం.. అది వివాదాస్పదం కావడం మామూలే. అయితే కొంతకాలంగా సోషల్‌మీడియాకు దూరంగా ఉన్న రిషి..తాజాగా ఓ ట్వీట్‌ చేశారు.

‘అందరికీ హల్లో. దాదాపు 23 రోజుల తర్వాత నేను మళ్లీ ట్విటర్‌లోకి వచ్చానని చెప్పడానికే ఈ ట్వీట్‌ చేస్తున్నాను. మీ అందరినీ, మీ నుంచి వచ్చే ఫన్‌ని, గొడవల్ని మిస్సయ్యాను’ అని తనదైన శైలిలో ట్వీట్‌ చేశారు.

ప్రముఖ హాలీవుడ్‌ నటి కిమ్‌ కర్దాషియాన్‌ నుంచి డెమోక్రటిక్‌ అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌ వరకు రిషి కపూర్‌ అందరిపై కామెంట్లు చేసేవారు. పాక్‌లో గూఢచర్యం ఆరోపణల కింద అరెస్టైన భారత నేవీ మాజీ అధికారి కుల్‌భూషణ్‌ జాదవ్‌ గురించి రిషి ట్వీట్‌ చేయడం తీవ్ర వివాదాస్పదమైంది. పాక్‌ జాదవ్‌కు మరణశిక్ష విధించాలని అప్పట్లో నిర్ణయించినప్పుడు పాకిస్థానీయుల గురించి రిషి తప్పుగా మాట్లాడటం దుమారం రేపింది.

సినిమాల పరంగా రిషి కపూర్‌ ప్రస్తుతం ‘102 నాటౌట్‌’ చిత్రంతో బిజీగా ఉన్నారు. ఇందులో రిషి..అమితాబ్‌ బచ్చన్‌కు కుమారుడి పాత్రలో నటిస్తున్నారు. ఉమేశ్‌ శుక్లా దర్శకత్వం వహిస్తున్నారు. మే4న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.