తెలంగాణ, ఏపీ మధ్య గొడవ సృష్టించాలని..

ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడికి ప్రజలను రెచ్చగొట్టడం అలవాటుగా మారిందని బీజేపీ ఏపీ ప్రధాన కార్యదర్శి సురేష్‌ రెడ్డి విమర్శించారు. విలేకరులతో మాట్లాడుతూ..ఓటుకు నోటు కేసు సమయంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ప్రజల మధ్య గొడవ సృష్టించాలని ప్రయత్నించారని ఆరోపించారు. తెలంగాణా ఎన్నికల్లో లబ్ది కోసమే నాన్‌బెయిలబుల్‌ వారంట్‌ అంటూ చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారని ధ్వజమెత్తారు. ప్రధాని మోదీ, అమిత్‌ షాపై చంద్రబాబు చేస్తోన్న అబద్ధపు విమర్శలను ప్రజలను గమనిస్తున్నారని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌తో పొత్తు వల్ల ఎన్టీఆర్‌ ఆత్మ క్షోభిస్తుందన్నారు.

20 సీట్లు కూడా రావు: బీజేపీ అధికార ప్రతినిధి కోట సాయి కృష్ణ

కాంగ్రెస్‌ పార్టీలో అధికారంలో ఉన్నప్పుడే చంద్రబాబుపై కేసు నమోదైందని, కేసు పెట్టిన కాంగ్రెస్‌ పార్టీని వదిలి బీజేపీపై విమర్శలు చేయడం చంద్రబాబుకు తగదన్నారు. చంద్రబాబు కోర్టుకు వెళ్లకపోవడం వల్లనే నోటీసులు వచ్చాయని స్పష్టం చేశారు. మోదీపై విమర్శలు చేయడం వల్ల తెలంగాణ ఎన్నికల్లో, ఏపీ ప్రజల్లో సానుభూతి పొందేందుకు చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. 22 సార్లు చంద్రబాబుకు కోర్టుకు హాజరుకాకపోవడం వల్లే నోటీసులు వచ్చాయని తెలిపారు. జాతీయ స్థాయిలో మోదీ గ్రాఫ్‌ పడిపోతుందని అనే వారికి నిన్నటి సర్వేలు చెంపపెట్టు లాంటివన్నారు

. ఏపీలో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉన్నట్లు సర్వేల్లో వ్యక్తమవుతోందని, ఇదేవిధంగా ప్రజా వ్యతిరేకత టీడీపీపై కొనసాగితే వచ్చే ఎన్నికల్లో 20 సీట్లకు మించి రావని జోస్యం చెప్పారు. టీడీపీకి వైఎస్సార్‌సీపీకి సర్వేల్లో 5 నుంచి 6 శాతం ఓట్ల తేడా ఉంది..రానున్న రోజుల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు. టీడీపీ ప్రభుత్వం పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందని విమర్శించారు. చంద్రబాబు నాయుడు ఏపీ ప్రజలను గ్రాఫిక్స్‌తో భ్రమలలో ముంచుతున్నారని ఎద్దేవా చేశారు.