దక్షిణాది చిత్రాల్లో నటించేందుకు సిద్ధం

దక్షిణాది చిత్రాల్లో నటించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రముఖ బాలీవుడ్‌ నటి సన్నీలియోన్‌ వెల్లడించారు. ప్రముఖ టీవీ చానల్‌ జీ5లో కరన్‌జిత్‌ కౌర్‌ సీజన్‌–2 ప్రారంభం కానున్న సందర్భంగా నటి సన్నీలియోన్‌ చెన్నై సందర్శించారు. శుక్రవారం నగరంలోని ఓ హోటల్‌లో ఏర్పాటైన విలేకరుల సమావేశంలో ఆమె పాల్గొని తన అనుభవాలను పంచుకుంది. గత జూలైలో తన బయోపిక్‌ పేరిట కరన్‌జిత్‌ కౌర్‌ సీజన్‌–1కు వీక్షకుల నుంచి అనూహ్య స్పందన లభించిందని, తనను ఆదరిస్తున్న పలు భాషా ప్రజలందరికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్లు పేర్కొన్నారు.

ప్రస్తుతం సీజన్‌–2 కూడా అందరినీ అలరించగలదని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం దక్షిణాది చిత్రాల్లో నటించేందుకు అనేక ఆఫర్లు వస్తున్నాయని, త్వరలో వీటిపై ఒప్పందం కుదుర్చుకుంటానన్నారు. అలాగే, తమిళ సూపర్‌ స్టార్స్‌తో నటించే అవకాశం వస్తే తప్పక నటిస్తానన్నారు. చిత్రాల్లో గ్లామర్‌ ఒలికించేందుకు సిద్ధమేనని, అయితే ఎంతమాత్రం హద్దులు దాటమని స్పష్టం చేశారు.