దళారులకు పండగ… మామిడి రైతుల విలవిల

జిల్లాలో వాణిజ్య, ప్రధాన పంటల సాగు కలిసి రాకపోవడంతో చాలా మంది రైతులు మామిడి సాగుపై శ్రద్ధ పెట్టారు. జిల్లాలో 53 వేల హెక్టార్లలో పంట సాగులో ఉంది. ప్రస్తుతానికి 37 వేల హెక్టార్లలో పంట చేతికి వస్తోంది. దిగుబడి అంచనా.. 6 లక్షల మెట్రిక్‌ టన్నులు అని భావిస్తున్నారు. వాస్తవానికి మామిడి ఉత్పత్తులకు మండీలలో రైతుకు టన్ను రూ.40 వేల వరకు పలుకుతుంటే బయట మార్కెట్‌లో మాత్రం కిలో రూ.80 నుంచి రూ.100 వరకు విక్రయిస్తున్నారు. తినే వాడికి మోత.. పండించే వాడికి వెత.. దళారులకు పండగ.. వెరసి మామిడి రైతుకు టెంక కనిపిస్తోంది. గత ఏడాది వర్షాలు లేక మామిడి తోటలు ఎండలకు ఎండి సంరక్షించుకోలేకపోయారు. ఈసారి ఓ మోస్తరు వర్షాలతో అరకొరగా పంట పండితే ధరతో తిరిగి మామిడి రైతుకు మొండిచేయే మిగిలింది.
మార్కెట్‌లో ఇలా…
ఒక రైతు మామిడి మండీల్లో విక్రయించేందుకు తీసుకెళ్తే 10 శాతం కమీషన్‌, 50 నుంచి 100 కిలోల వరకు తరుగు తీసుకుంటున్నారు. దీనికితోడు ఒక టన్ను మామిడి కొయ్యాలంటే రూ.2 వేల వరకు కూలి, రూ.2 వేలు చొప్పున రవాణా ఖర్చులు అవుతున్నాయి. టన్ను రూ.40 వేలు పలికితే తరుగు, కమీషన్లు, రవాణా ఛార్జీలు పోతే రూ.20 వేల నుంచి రూ.25 వేల వరకే మిగులుతోంది. అవే బయట మార్కెట్‌లో మాత్రం రూ.80 వేల వరకు పలుకుతోంది

మార్కెటింగ్‌ లేక వేదన…
ధర్మవరం, బెంగళూరు, అనంతపురం, కర్ణాటకలోని చిల్లగట్టు, హైదరాబాద్‌ ప్రాంతాలకు మామిడిని తీసుకెళతారు. ఏడాదిపాటు కష్టపడినా కనీసం కూలి కూడా గిట్టడంలేదని ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం మార్కెట్‌ సౌకర్యం కల్పించడం లేదని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

నిరాశే మిగిలింది…
జిల్లాలో బుక్కపట్నం మండలం బుచ్చయ్యగారిపల్లి మామిడి ఎంతో పేరు గాంచింది. ఇక్కడ 3,700 ఎకరాల్లో మామిడి తోటలు విస్తరించి ఉన్నాయి. సారవంతమైన నేలలు కావడంతో మామిడి కాయలు కూడా ఎంతో రుచిగా ఉంటాయి. ఈసారి అరకొరగా పంట ఉన్నా ధర పలుకుతుండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేశారు. ఒక్కసారిగా ధర పడిపోవడంతో నిరాశ ఆవరించింది.

దళారుల దందాతోనే నష్టం
మొదటగా వచ్చిన పంటకు ఒక మోస్తరు ధర పలికింది. ప్రస్తుతం వ్యాపారస్తులు రింగ్‌ అవ్వడంతో ధర పడిపోయింది. బయట ప్రజలు మామిడి కొనుగోలు చేసేందుకు ధర ఉన్నప్పటికి రైతుకు మాత్రం దళారుల వేటు పడుతోంది. ఎక్కడ చూసినా మండీలలో కమీషన్లు, తరుగు పేరుతో గిట్టుబాటుధర కల్పించకుండా గ్రేడింగ్‌లతో మరింత మోసం చేస్తున్నారు. రైతు విక్రయించుకునేందుకు ఎటువంటి సదుపాయాలు లేకపోవడంతో ఏటా కష్టాలు తప్పడంలేదు.