దీపిక, రణ్‌వీర్‌ వివాహ వేదిక ప్రత్యేకతలివే..

బాలీవుడ్‌ హాట్‌ జోడీ దీపికా పడుకోన్‌, రణ్‌వీర్‌ సింగ్‌ నవంబర్‌ 10న వివాహ బంధంతో ఒక్కటి కానున్నారనే ప్రచారం సాగుతోంది. వీరి వివాహం ఇటలీలోని కోమో సరస్సు సమీపంలోని అద్భుత లొకేషన్స్‌లో జరగనుందని చెబుతున్నారు. ఉత్తర ఇటలీలోని లంబార్డీ ప్రాంతంలో మైమరిపించే ప్రకృతి సోయగాల నడుమ ఈ సరస్సు ఉండటంతో వివాహ వేదికగా ఈ ప్రాంతాన్ని వారు ఎంచుకున్నట్టు తెలిసింది.

సరస్సు చుట్టూ నిర్మించిన విల్లాలు అతిధులకు విడిదిగా మారనున్నాయి. మరోవైపు ఆల్ప్‌ పర్వత శ్రేణులు ఈ ప్రాంతానికి అదనపు ఆకర్షణగా చెబుతున్నారు. ఇక 2013 నుంచి పద్మావత్‌ జంట డేటింగ్‌లో ఉన్నట్టు వదంతులు గుప్పుమన్నా వీరు బాహాటంగా తమ అనుబంధంపై లేదా పెళ్లి ప్రచారంపైనా ఇంతవరకూ నోరుమెదపలేదు.

అయితే పలు సందర్భాల్లో ఈ ప్రేమ జంట బహిరంగంగా ఒకరిపై ఒకరు తమ అభిమానం చాటుకున్నారు. ఇరువురూ ఒకరి సినిమాలను మరొకరు మెచ్చుకోవడంలో ముందుంటారు.