నాకు ఇష్టమైన నటుల్లో బ్రహ్మాజీ ఒకరు: మహేశ్‌

హైదరాబాద్‌: బ్రహ్మాజీ..విలన్‌ పాత్రల్లోనే కాదు కమెడీయన్‌గానూ తానేంటో నిరూపించుకున్నారు. నటనతో, హాస్యంతో తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. సూపర్‌స్టార్‌ మహేశ్ బాబు నటించిన ‘భరత్‌ అనే నేను’ చిత్రంలో బ్రహ్మాజీ సీఎం భరత్‌కు పీఎస్‌(పర్సనల్‌ సెక్రటరీ) భాస్కర్‌ పాత్రలో హాస్యం పండించారు. ఈ సినిమాలో ఆయన పాత్రకూ మంచి మార్కులు పడ్డాయి. అందుకే తన సినిమాలో బ్రహ్మజీ ఉంటే తనకు కలిసొస్తుందని మహేశ్‌ అంటున్నారు.

సోమవారం హైదరాబాద్‌లో ‘భరత్‌ అనే నేను’ విజయోత్సవ వేడుక ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మహేశ్‌ బ్రహ్మాజీ గురించి మాట్లాడుతూ..‘నేను, బ్రహ్మాజీ నటించిన సినిమాలు 99 శాతం విజయం సాధించాయి. నాకు ఇష్టమైన నటుల్లో బ్రహ్మజీ ఒకరు.’ అన్నారు.

అనంతరం కొరటాల శివ మాట్లాడుతూ.. ‘అతను అరుదైన నటుడు. ఏ సన్నివేశంలోనైనా హాస్యాన్ని, భావోద్వేగాన్ని పండించగలరు. అతను నేచురల్‌ యాక్టర్‌. ‘భరత్‌ అనే నేను’లో తొలి సగ భాగం సినిమా మొత్తం బ్రహ్మాజీదే. అక్కడ మహేశ్‌ మనకు నవ్వులు తెప్పించారు.’ అని చెప్పుకొచ్చారు.

‘అతడు’, ‘దూకుడు’, ‘బిజినెస్‌మ్యాన్‌’ తదితర చిత్రాల్లో మహేశ్‌తో కలిసి నటించారు బ్రహ్మాజీ.