నారాలోకేశ్‌కు ట్విటర్‌లో క్లాస్‌ పీకిన కొడాలి నాని

ట్విటర్‌ వేదికగా మంత్రి నారాలోకేశ్‌కు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే కొడాలి నాని క్లాస్‌ పీకారు. ఈ పకోడీ ట్వీట్లు వేయడం మానేసి.. తొలుత తెలుగు నేర్చుకోవాలని హితవు పలికారు. ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నం అనంతరం తొలుత దాడిని ఖండిస్తూ ట్వీట్‌ చేసిన నారా లోకేశ్‌.. సాయంత్రానికే తన అభిప్రాయాన్ని మార్చుకున్నారు. తన తండ్రి సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడిన మాటలతో మేలుకున్న లోకేశ్‌.. ఈ దాడి గురించి ప్రస్తావిస్తూ వరుస ట్వీట్ల్‌ పెట్టారు. ఈ ట్వీట్లకు #ShamelessTDP అనే హ్యాష్‌ ట్యాగ్‌తో కొడాలి నాని తనదైన శైలిలో బదులిచ్చారు.

‘నేరుగా ఎన్నికల్లో పోటీ చేసే దమ్ములేక, నాన్నారు నామినేట్ చేస్తే MLCగా మంత్రి అయిన నువ్వు గెలుపు-ఓటముల గురించి మాట్లాడటం హాస్యాస్పదం. అధికారంకోసం పొత్తులు,అవసరం తీరాక నిందలు వేయటం మీకు ఏమాత్రం కొత్తకాదు. రాష్ట్రప్రజలను మరోసారి మభ్య పెట్టొచ్చు అనుకోవడం మీ మూర్ఖత్వం’ అని లోకేశ్‌ ట్వీట్లను తిప్పికొట్టారు. అంతేకాకుండా లోకేశ్‌ ట్వీట్లలోని తెలుగు తప్పులను గుర్తించి.. ట్వీట్లు చేయడం మానేసి తొలుత తెలుగు నేర్చుకోవాలని ఎద్దేవా చేశారు.