నాలుగేళ్లుగా తీవ్ర ఒత్తిడితో… జైరా వసీం

‘దంగల్‌’ సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన 17 ఏళ్ల జైరా వసీం తీవ్ర మానసిక వేదనకు గురవుతోంది. నాలుగేళ్లుగా తీవ్ర ఒత్తిడి కారణంగా నిరాశ, నిస్పృహలకు గురవుతున్నానని, ఒక్కోసారి ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తోందని వాపోయింది. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే నవ్వుతారని ఎవరికీ చెప్పుకోలేకపోయానంటోంది. చదువు, పని నుంచి, ముఖ్యంగా సామాజిక మాధ్యమాలకు పూర్తిగా దూరంగా ఉండాలని కోరుకుంటున్నట్లు ‘ఇన్‌స్టాగ్రామ్‌’లో పెద్ద లేఖ పోస్ట్‌ చేసింది. ‘ఎంతోకాలంగా తీవ్ర ఆందోళన, ఒత్తిడికి గురవుతున్నానని అంగీకరించకుండా ఉండటం ఇక నా వల్ల కాదు. ఎవరికైనా చెబితే, అంత ఒత్తిడికి గురవ్వాల్సిన వయస్సేంకాదని కొట్టిపారేస్తారు. ఈ వయస్సులో అందరికీ అలాగే ఉంటుందని తేలిగ్గా తీసుకుంటారు. ఇదో భయంకరమైన దశ. ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందని ఎన్నడూ అనుకోలేదు. నిరాశ నుంచి బయటపడేస్తాయని రోజూ ఐదుమాత్రలు మింగుతున్నాను. అర్ధరాత్రుళ్లు ఆసుపత్రికి పరుగెడుతున్నాను. ఒంటరినైపోయా. విశ్రాంతి లేదు. ఏదో ఆతృత. లేనిది ఉన్నట్లు.. ఉన్నది లేనట్లు కనిపిస్తున్నాయి. కొన్నివారాలుగా కంటినిండా నిద్ర లేదు. ఒకప్పుడు పీకలదాకా తినేదాన్ని. ఇప్పుడు కడుపు మాడ్చుకుంటున్నాను. చెప్పలేనంత అలసటగా ఉంది. ఒళ్లంతా నొప్పులు. నా మీద నాకే అసహ్యం వేస్తోంది. నరాలు చిట్లిపోతున్నాయి. పాతికేళ్లు దాటాకే ఇలా అవుతుందని విన్నాను. మరి నాకేంటి ఇలా?. ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తోంది..’ అని జైరా వాపోయింది.