నా జీవితంలో కథలు చాలా ఉన్నాయి…అమితాబ్‌బచ్చన్‌

వయసుతో సంబంధం లేకుండా తనను తాను వెండితెరపై సరికొత్తగా ఆవిష్కరించుకొనే ప్రయత్నం చేస్తుంటారు అమితాబ్‌బచ్చన్‌. 50 ఏళ్ల సినీ జీవితంలో ఎన్నో గొప్ప పాత్రలకు ప్రాణం పోశారాయన. తాజాగా ఆయన 102 ఏళ్ల వ్యక్తిగా నటించిన చిత్రం ‘102 నాట్‌ అవుట్‌’. ఇందులో రిషికపూర్‌కు తండ్రి పాత్రలో నటించారు. ఈ నెల 4న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా ఈ చిత్ర విశేషాలతో పాటు మరిన్ని ఆసక్తికర సంగతులు పంచుకొన్నారు అమితాబ్‌బచ్చన్‌.
మీ తండ్రి హరివంశ్‌రాయ్‌ బచ్చన్‌ మీతో ఎలా ఉండేవారు? అభిషేక్‌తో మీ అనుబంధం ఎలా ఉంటుంది?
నా తండ్రి బచ్చన్‌ అనే ఇంటిపేరుకే గొప్ప పేరు తీసుకొచ్చారు. అంతేకాదు మర్యాద, విలువలు, సృజనాత్మకతల్నీ నాకు అందించారు. ఆయన వారసత్వంగా ఇచ్చిన పేరు ప్రఖ్యాతుల్ని మరింత పెంచే ప్రయత్నమే చేశాను. నా వారసులు అదే చేయాలనే కోరుకుంటున్నాను. వాళ్లకు అదే చెప్పాను.
‘102 నాట్‌ అవుట్‌’కి పనిచేశాకా ఓ నటుడు, ఓ వ్యక్తిగా మీరు తెలుసుకున్న కొత్త విషయాలేంటి?
రోజూ ఏదో కొత్త విషయం నేర్చుకుంటూనే ఉంటాను. అనుభవమే ఎన్నో నేర్పుతుంది. ప్రేక్షకులు మన కష్టాన్ని గుర్తిస్తే సంతోషమే. లేదంటే మరోసారి ప్రయత్నం చేయాల్సిందే.
డిజిటల్‌ యుగంలో తరాల మధ్య అంతరం బాగా పెరిగిపోయిందనుకుంటున్నారా?
ప్రతి దశాబ్దం ఓ కొత్త తరాన్ని మనకు పరిచయం చేస్తుంటుంది. వాళ్లు కొత్త ఆలోచనలు, జీవితంపట్ల వాళ్ల శైలి అవగాహనతో అడుగుపెడుతుంటారు. కొత్త తరాన్ని నేను ఎప్పుడూ స్వాగతిస్తాను. వాళ్లతో కలిసిపోయే ప్రయత్నం చేస్తుంటాను. ఈ విషయంలో సోషల్‌ మీడియా నాకు చాలా సహాయపడుతుంది. నా బ్లాగ్‌ ద్వారానూ…ఇతర సామాజిక మాధ్యమాల ద్వారా అందరికీ దగ్గర కావడానికి ఆస్కారం దొరికింది.
సుమారు మూడు దశాబ్దాల తర్వాత రిషికపూర్‌తో కలిసి నటించారు. మీ ఇద్దరి మధ్య మాకు తెలియని కొత్త విషయాలను పంచుకోవచ్చు కదా?
ఇన్నేళ్ల తర్వాత రిషితో పనిచేయడం సైకిల్‌ దిగి మళ్లీ ఇప్పుడు ఎక్కినట్టుగానే ఉంది. మా మధ్య ఇన్‌సైడ్‌ స్టోరీస్‌ చెప్పాలంటే జీవితకాలం పడుతుంది. అయినా ఆ కథలన్నీ చాలా సంతోషంగా సాగినవే.
102 ఏళ్ల వ్యక్తి పాత్రలో నటించి ఓ చైనా నటుడి రికార్డుని దాటేశారు..50 ఏళ్ల మీ నట జీవితంలో ఇంకా ఏ రికార్డుల్ని బద్దలుకొట్టాలనుకుంటున్నారు?
రికార్డులు బద్దలుకొట్టడం గురించి నేను పెద్దగా పట్టించుకోను. నా పని ధర్మం రికార్డులు బ్రేక్‌ చేయడం కాదు…నాకు అప్పజెప్పిన పనికి న్యాయం చేయడం.
మీ అమ్మాయి శ్వేత నంద ఓ నవల రాశారు కదా… రచనలో మీ కుటుంబ వారసత్వాన్ని బతికించే ప్రయత్నం అనుకుంటున్నారా?
కచ్చితంగా.. రచయితగా మారి నా తండ్రి వారసత్వాన్ని నిలబెట్టినందుకు ఆమె తండ్రిగా నేను గర్వపడుతున్నాను.
రచయితగా మారాలనే ఆలోచన మీ మనసులో ఏమైనా ఉందా?
లేదు…ఎప్పటికీ రాదు. ఎందుకంటే రచన చేసే లక్షణాలు నాలో లేవు.