నా భార్యతో నీకేంట్రా పని…

తన భార్యతో చనువుగా మాట్లాడుతున్నాడన్న కారణంతో ఓ వ్యక్తిని చితకబాదిన భర్తను హర్యానా పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్‌ చేశారు. పట్టపగలే ఈ దాడి చోటు చేసుకోవటం, పైగా వీడియో వైరల్‌ కావటం.. దానికితోడు బాధితుడు ఫిర్యాదు చేయటంతో సదరు శాడిస్ట్‌ భర్తను పోలీసులు కటకటాల వెనక్కి నెట్టారు. వివరాల్లోకి వెళ్తే…

ఫతేహాబాద్‌ జిల్లా రటియా పట్టణంలో కరమ్‌జీత్‌ తన భార్యతో నివసిస్తున్నాడు. మంగళవారం మధ్యాహ్నం లవ్లీ అనే స్నేహితుడితో బైక్‌పై బస్టాండ్‌ మీదుగా వెళ్తున్నాడు. ఆ సమయంలో బస్టాండ్‌లో కరమ్‌జీత్‌ భార్య, మందమ్‌ సింగ్‌ అనే వ్యక్తితో మాట్లాడుతూ కనిపించింది. అది గమనించిన కరమ్‌ వాళ్ల దగ్గరికి వెళ్లి నిలదీశాడు. తాము చిన్ననాటి స్నేహితులమని, క్యాజువల్‌గా కలుసుకున్నామని వాళ్లు వివరణ ఇచ్చే యత్నం చేశారు. అయితే కరమ్‌ మాత్రం సమాధానం పూర్తయ్యేలోపే మందన్‌పై పిడిగుద్దులు గుప్పించాడు. వద్దని భార్య వేడుకుంటున్నా.. ఆమెను పక్కకు తోసేశాడు. ఇంతలో కరమ్‌కు అతని స్నేహితుడు కూడా తోడు కావటం, ఆపై మరికొందరు స్థానికులు కూడా వాళ్లకు కలవటంతో మందమ్‌ను చిత్తుగా కొట్టేశారు.

స్థానికులు వీడియోలు తీస్తూ ఉండిపోయారే తప్ప.. రక్షించే యత్నం చేయలేదు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి మందన్‌ను ఆస్పత్రికి తరలించారు. వీడియో కాస్తా వాట్సాప్‌ గ్రూప్‌ల్లో చక్కర్లు కొట్టింది. బాధితుడి ఫిర్యాదు మేరకు కరమ్‌, లవ్లీలను పోలీసులు అరెస్ట్‌ చేశారు. మరికొందరిని గుర్తించాల్సి ఉందని స్థానిక ఎస్సై తెలిపారు. ఇదిలా ఉంటే అనుమానంతో తన భర్త తరచూ హింసించే వాడని, మందమ్‌ను కొట్టొద్దని వేడుకున్నా కనికరించలేదని కరమ్‌జీత్‌ భార్య చెబుతున్నారు. ఈ మేరకు భర్తపై వేధింపుల ఫిర్యాదు కూడా ఆమె చేయటం విశేషం.