‘నా శరీరాన్ని పూడ్చిపెట్టొద్దు..’

 

లేఖ రాసి సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ఆత్మహత్యబండ్లగూడ: ‘నేను చనిపోయిన తర్వాత నన్ను పూడ్చిపెట్టకండి. నాకు నా శరీరం అంటే చాలా ఇష్టం. పూడ్చితే శరీరానికి పురుగులు పడతాయి. నా ఫోను, బైకు తమ్ముడికి ఇవ్వండి. నా ఆఫీసుకు సంబంధించిన వస్తువులు అధికారులకు అప్పగించండి’ అంటూ ఓ యువ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ లేఖ రాసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎల్బీనగర్‌ పోలీసుల కథనం ప్రకారం ప్రకాశం జిల్లాకు చెందిన జప్పుల కృష్ణారావు నాగోల్‌ సాయినగర్‌ రోడ్డు నంబర్‌-3లో తన కుటుంబంతో కలిసి ఉంటున్నారు. రైల్వేలో డిప్యుటేషన్‌పై మంచిర్యాల్‌లో విధులు నిర్వహిస్తున్నారు. గురువారం విధుల కోసం కృష్ణారావు వెళ్లగా భార్య రాణి బాపట్లలో బంధువుల వివాహానికి రెండు రోజుల క్రితం వెళ్లింది. సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరైన పెద్దకుమారుడు శ్రీనివాస్‌ మార్తాండ్‌(25), డిగ్రీ చదువుతున్న రెండో కుమారుడు విష్ణుతేజ సాయినగర్‌లోని ఇంట్లో ఉన్నారు. శుక్రవారం ఉదయం విష్ణుతేజ నిద్ర లేచి పడక గది తలుపు తెరిచేందుకు ప్రయత్నించగా బయట నుంచి గడియ పెట్టి ఉంది. ఎంత తట్టినా తీయ్యకపోవడంతో పైనున్న వెంటిలేటర్‌ నుంచి చూడగా హాల్లో శ్రీనివాస్‌ మార్తాండ్‌ ఫ్యానుకు చీరతో ఉరివేసుకుని వేలాడుతూ కనిపించాడు. గట్టిగా కేకలు వేయడంతో చుట్టు పక్కల వారు వచ్చి తలుపులు బద్దలుకొట్టి పడకగది తెరిచారు. వెంటనే తల్లిదండ్రులకు సమాచారమిచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సూసైడ్‌ నోటు స్వాధీనం చేసుకున్న పోలీసులు అతడి మరణానికి గల కారణాలు అందులో లేనట్లు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు.