నిద్రనే విజయ రహస్యం అంటున్నాడు: ధోనీ

ముంబై: ఎంఎస్ ధోనీ చెలరేగి ఆడుతుంటే చెన్నై అభిమానుల ఆనందానికి హద్దే లేదు. సూపర్ ఫామ్‌తో ప్రత్యర్థులపై రెచ్చిపోతున్నాడు. సోమవారం ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ధోనీ సిక్సర్ల మోతకు పూణే స్టేడియం హోరెత్తింది. ఆటగాడిగానే కాదు.. కెప్టెన్‌గానూ జేజేలు అందుకుంటున్నాడు. రెండేళ్ల విరామం తర్వాత మళ్లీ ఐపీఎల్‌లోకి అడుగుపెట్టిన చెన్నైను అగ్రస్థానంలో నిలబెట్టిన నాయకుడిగా ప్రశంసలు సొంతం చేసుకున్నాడు. ఇంతకీ ఈ మిస్టర్ కూల్ విజయ రహస్యం ఏంటో తెలుసా..? నిద్ర.. కంటినిండా నిద్రపోవడమే ధోనీ విజయ రహస్యం అంటున్నాడు చెన్నై కీలక ఆటగాడు షేన్ వాట్సన్. లంచ్ బ్రేక్ అయినా, బ్రేక్ ఫాస్ట్ అయినా.. ధోనీ ఎక్కువగా కనపడడని.. అతనికి నిద్రలోనే హాయిఉంటుందని.. అదే అతని దూకుడుకి కారణమని వాట్సన్ తెలిపాడు.

2018 ప్రారంభం నుంచి టీ20లలో ధోనీ బ్యాటింగ్‌తో అదరగొడుతున్నాడు. ఈ ఏడాది మొదట్లో సౌతాఫ్రికాతో జరిగిన టీ20లో హాఫ్ సెంచరీతో మెరిస్తే.. అదే ఫామ్‌ను ఐపీఎల్‌లోనూ కొనసాగిస్తున్నాడు. గత సీజన్‌లో పూణే తరఫున ఆడినా పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. కానీ ఈ సీజన్‌లో మాత్రం రెట్టించిన ఉత్సాహంతో ఆడుతున్నాడని విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు.