నిప్పులేనిదే పొగరాదని …ముఖ్యమంత్రి

 

బీసీలకు తెదేపా అన్యాయం చేసిందని ఇప్పుడు వైకాపా యాగీ చేస్తోంది. తెదేపాతో ఉన్నారన్న కోపంతో కాంగ్రెస్‌ హయాంలో పదేళ్లపాటు బీసీలను కసితో, కక్షతో అణగదొక్కారు. తెదేపా హయాంలోనే బీసీలకు ఉన్నత స్థానాలు లభించాయి. ఎనిమిది మంది వీసీలు అయ్యారు. ఎనిమిది మందికి మంత్రిపదవులు ఇచ్చాం. తొమ్మిది మంది హైకోర్టు జడ్జిలయ్యారు. పదవీ విరమణ చేసిన అధికారులు ఎక్కడా ఉద్యోగం లేక ప్రభుత్వంపై నిందలు మోపుతున్నారు. బీసీలకు తెదేపా వ్యతిరేకమంటూ ప్రచారం చేస్తున్నారు.

రాష్ట్రంలో అభివృద్ధి ఆగిపోవాలని వైకాపా కుట్రలు చేస్తోంది. రూ.కోట్లు వెచ్చించి ప్రశాంత్‌ కిశోర్‌ అనే సలహాదారును పెట్టుకుంది. సమాజంలో అశాంతి, విధ్వంసాలు సృష్టించడం, అభూతకల్పనలు చేయడం ఆయన ఆలోచనల్లో భాగమే. వారి ఆటలు ఇక్కడ సాగవ్‌.

రాష్ట్రంలో ఐఏఎస్‌ అధికారులు, పారిశ్రామికవేత్తలు, చివరకు మీడియాపై కూడా కేంద్రం కక్షసాధించే అవకాశం ఉంది. సీబీఐ కేసులు పెట్టి వేధించాలని చూస్తే, అంతకు అంత మూల్యం చెల్లించాల్సి ఉంటుంది.
– చంద్రబాబు
భాజపా, వైకాపాలు మొన్నటి వరకు రహస్య అజెండాతో పనిచేశాయని, ఇప్పుడు వాళ్ల కుట్రల బహిర్గతమవుతున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు ధ్వజమెత్తారు. ఈ రెండు పార్టీలు నాలుగు రోజులు కూడా ఆగలేకపోతున్నాయని, ఎంత త్వరగా కలసిపోదామా? ఎంత త్వరగా కేసులు మాఫీ చేసుకుందామా? ఎంత త్వరగా ప్రజల్ని మోసం చేద్దామా అన్న ఆత్రంలో ఉన్నాయని విరుచుకుపడ్డారు. జగన్‌కు మించిన నాయకుడు లేడంటూ కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ సహాయ మంత్రి రాందాస్‌ అథవాలే విజయవాడలో చేసిన వ్యాఖ్యలే వారి కుట్రకు అద్దంపడుతున్నాయని మండిపడ్డారు. ఆ రెండు పార్టీలూ త్వరలోనే పొత్తు కుదుర్చుకున్నా, కలసి పోటీ చేసినా ఆశ్చర్యం లేదన్నారు. కేంద్రం చాలా నాటకాలాడుతోందని మండిపడ్డారు. ‘‘మీరు ఇంకేం నీతిని పరిరక్షిస్తారు? మీవి పద్ధతిలేని రాజకీయాలు, పద్ధతిలేని పొత్తులు. అన్ని కేసులున్నవారిని నెత్తిన పెట్టుకున్నాక… తప్పు చేసినవాళ్లు మీకెలా భయపడతారు? వాళ్లు పారిపోయినా మీరు పట్టుకోలేరు. మీ విధానంలోనే లోపం ఉంది’’ అని ముఖ్యమంత్రి నిప్పులు చెరిగారు. తమిళనాడులోలా ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు చేయాలనుకంటే ఆటలు సాగవన్నారు. తాను ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని స్పష్టంచేశారు. ప్రజల్ని తనకు రక్షణగా ఉండాలని అన్నట్టుగా కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి వ్యతిరేకంగా కుట్రలు చేస్తుందని, దాన్ని అడ్డుకోవాలని మాత్రమే ప్రజలకు పిలుపునిచ్చినట్టు ఆయన తెలిపారు. ‘వస్తున్నా మీకోసం’ పాదయాత్ర ముగిసి ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా ఆయన శుక్రవారం సచివాలయంలో విలేఖరుల సమావేశంలో మాట్లాడారు.
నన్ను బెదిరించాలని చూస్తారా?
నీతులు మాట్లాడే భాజపా పెద్దలు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో అవసరం లేకపోయినా వైకాపా మద్దతు ఎందుకు తీసుకున్నారని చంద్రబాబు ప్రశ్నించారు. ‘‘ప్రధాని కార్యాలయంలో వైకాపా ఎంపీల్ని కూర్చోబెట్టుకుని రాజకీయాలు చేస్తూ ఎలాంటి సంకేతాలిస్తున్నారు? రేపోమాపో వైకాపాతో కలుస్తామని మీ ప్రభుత్వంలోని మంత్రులే ఇప్పుడు చెబుతున్నారు. జగన్‌ విశాఖపట్నం వచ్చాక కలుస్తామని మీ ఎమ్మెల్యే చెబుతున్నారు. పైగా నేను భయపడుతున్నానని, జగన్‌ భయపడటం లేదని అంటున్నారు. అన్ని కేసులున్నా మీరు అండగా ఉన్నారు కాబట్టే జగన్‌ భయపడటం లేదు. నన్ను బెదిరించాలని చూస్తారా’’ అని సీఎం మండిపడ్డారు. స్విస్‌బ్యాంకులో ఉన్న నల్లధనాన్ని వెనక్కు రప్పిస్తామని, అవినీతి కేసులన్నీ ఏడాదిలో పరిష్కరించి, దోషులకు శిక్షపడేలా చేస్తామని నరేంద్ర మోదీ చెప్పారని, ఆ మాటలన్నీ ఏమయ్యాయని ప్రశ్నించారు. ‘‘మీకు కావలసిన కేసుల్ని మాత్రం త్వరితగతిన పరిష్కరిస్తున్నారు. సీబీఐ కేసుల్లో ఏ1, ఏ2లుగా ఉన్నవారిని ఇంటికి పిలిపించుకుంటున్నారు. ఎలాంటి మచ్చ లేనివారిపై కేసులు పెడుతున్నారు. ఇది తెలివి కాదు. అతి తెలివి’’ అని ముఖ్యమంత్రి ధ్వజమెత్తారు. రాష్ట్రంలో కొందరు అధికారులు, నాయకులపై సీబీఐ కేసులు పెట్టేందుకు కేంద్రం సన్నాహాలు చేస్తోందన్న ప్రచారం జరుగుతోంది కదా, మీరేమంటారు? అన్న ప్రశ్నకు… నిప్పులేనిదే పొగరాదని, అలాంటి ఆలోచన జరగకుండా వదంతులు వ్యాపించవని సీఎం బదులిచ్చారు. భాజపా, వైకాపాలు కలసి రాష్ట్రంపైనా, పోలవరం, రాజధాని, విభజన చట్టం, ప్రత్యేక హోదా వంటి అంశాలకు వ్యతిరేకంగా కుట్ర చేసే అవకాశం ఉందని, ప్రజలు వాటిని ఎదుర్కోవాలని చెప్పానే తప్ప, వ్యక్తిగతంగా తనకు రక్షణ కవచంగా ఉండమని తాను చెప్పలేదన్నారు. నాలుగేళ్ల క్రితం నరేంద్ర మోదీ తిరుపతిలో రాష్ట్రానికి హామీలిచ్చిన చోటే ఈ నెల 30న బహిరంగ సభ నిర్వహిస్తున్నామని, వెంకన్నసాక్షిగా ఆ రోజు ఆయన చెప్పిన ప్రతి మాటనూ గుర్తు చేస్తామని సీఎం తెలిపారు. ‘‘మనకు గౌరవం ఇవ్వకపోయినా వేంకటేశ్వరస్వామికైనా ఇవ్వాలి కదా?’’ అని వ్యాఖ్యానించారు.

మనతో మాట్లాడి, దిల్లీ వెళితే ఏంటర్థం?
‘‘గవర్నర్‌ వ్యవస్థ రాజకీయాలకు అతీతంగా పవిత్రంగా ఉండాలి. తెదేపా మొదటి నుంచి గవర్నర్‌ వ్యవస్థతో ఇబ్బందులు పడింది. ఎన్టీఆర్‌ ప్రభుత్వానికి పూర్తి మెజార్టీ ఉన్నా గవర్నర్‌ రాంలాల్‌ బర్తరఫ్‌ చేశారు. కుముద్‌బెన్‌ జోషీతో ప్రతి రోజూ గొడవలే. భాజపా ప్రభుత్వం కూడా ప్రస్తుత గవర్నర్‌ను ఉపయోగించుకుని అనవసర రాజకీయాలు చేస్తోందనే నేను చెప్పాను. గవర్నర్‌ కూడా దానికి అవకాశమివ్వకూడదు. మనతో మాట్లాడి, దిల్లీ వెళితే ఏంటర్థం? అది వదంతులకు బలం చేకూర్చడమే కదా? గవర్నర్‌పై నాకు అనుమానమని కాదు, ప్రజలకు అనుమానం వచ్చేలా ప్రవర్తించకూడదనే నేను చెబుతున్నా. కేంద్రంలో ఏ ప్రభుత్వమున్నా వాళ్లకు కావలసిన పనులు చేయడానికి, నివేదికలివ్వడానికే గవర్నర్లను పెట్టుకుంటారు’’ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

కేంద్ర రాజకీయాలు తెదేపాకి కొత్త కాదు
తృతీయ ఫ్రంట్‌పై విలేకరుల ప్రశ్నకు బదులిస్తూ… ‘‘కేంద్రంలో రాజకీయాలు చేయడం తెదేపాకి కొత్తకాదు. తెదేపానే దేశంలో నూతన రాజకీయ వ్యవస్థకు శ్రీకారం చుట్టింది. ఇందిరాగాంధీ ఆధిపత్యాన్ని ఎవరూ సవాల్‌ చేయలేని పరిస్థితుల్లో ఎన్టీఆర్‌ ఆమెకు ఎదురు నిలిచారు. నేషల్‌ ఫ్రంట్‌, యునైటెడ్‌ ఫ్రంట్‌లు ఏర్పాటు చేశాం. థర్డ్‌ ఫ్రంట్‌, రాష్ట్రాలపై కేంద్ర పెత్తనం, రాష్ట్రాల అధికారాల గురించి చర్చ జరగాలి. కేంద్రంలో బాధ్యతగల ప్రభుత్వం ఉండాలి. రాష్ట్రాలను ఇష్టానుసారం అణగదొక్కుతామంటే కుదరదు’’ అని ముఖ్యమంత్రి అన్నారు. తెదేపా హయాంలో జడ్జిలైనవారే ఇప్పుడు విమర్శిస్తున్నారని వాటిని కొన్ని పత్రికలు మొదటి పేజీలో ప్రచురిస్తున్నాయని గతంలో వారికి వ్యతిరేకంగానే ఆ పత్రికలు వార్తలు రాశాయని చంద్రబాబు గుర్తుచేశారు. ‘‘ఈ ప్రభుత్వంలో పనిచేసి ఇక్కడున్నప్పుడు బ్రహ్మాండమైన ప్రభుత్వమని సంతకాలు పెట్టినాయన, బయటకు వెళ్లాక రాజధాని దొనకొండలో పెట్టాలంటున్నారు. మరొకాయన మరో పుస్తకం రాశారు. మీ పనేదో మీరు చేసుకోవాలిగానీ ఈ పుస్తకాలేంటి? పరిపాలన గురించి నాకు చెబుతారా? వ్యక్తిగత, రహస్య అజెండాలు, స్వార్థ ప్రయోజనాలతో మాట్లాడితే ప్రజలు హర్షించరు’’ అని సీఎం మండిపడ్డారు. మహారాష్ట్రకు చెందిన భాజపా మంత్రి సతీమణికి తితిదే పాలకమండలి సభ్యురాలిగా అవకాశమివ్వడం వెనుక ఎవరి సిఫార్సులూ లేవని, ఆమె వేంకటేశ్వరస్వామి భక్తురాలని, ఆ కుటుంబంతో తనకున్న సాన్నిహిత్యం వల్లే ఆమెను నియమించామని ఒక ప్రశ్నకు సమాధానంగా సీఎం తెలిపారు. మాజీ ఐపీఎస్‌ అధికారి లక్ష్మీనారాయణను మీ పార్టీలోకి ఆహ్వానిస్తారా? అన్న ప్రశ్నకు… అవన్నీ ఊహాజనిత ప్రశ్నలని, వాటికి సమాధానాలు చెప్పడం సరికాదని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.