నిర్లక్ష్యం ఆమె కాలును.. తినేసింది

నిర్లక్ష్యం ఆమె పాలిట శాపంగా మారింది. మాంసం తినే ఓ క్రిమి ఆమె కాలును తీవ్రంగా తొలిచి తినేసింది. కుడికాలును షేవ్‌ చేసుకుంటుండగా అయిన చిన్నగాటు ప్రమాదకరంగా మారి కాలే తీసేయాల్సి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. ఇంగ్లాండ్‌లోని బ్రీష్టన్‌కు చెందిన తాన్యా జెర్నోజుకో అనే మహిళ కొన్ని నెలల ముందు తన కుడికాలును రేజర్‌తో షేవ్‌ చేసుకుంటుండగా చిన్నగాయం అయ్యింది. అయితే చిన్న గాయమే కదా అని ఆమె ఊరకుండిపోయింది. కొద్దిరోజుల తర్వాత అది చిన్నపాటి నాణెం సైజులోకి మారింది. అయినా ఆమె పట్టించుకోకపోవటంతో అది ఏకంగా పెద్దసెల్‌ఫోన్‌ సైజులోకి పెరిగి చర్మానికి రంధ్రం చేసింది.

ఇన్‌ఫెక్షన్‌ అలా పెరిగిపోవటంతో ఇక చేసేదేమీలేక ఆస్పత్రికి వెళ్లింది. డాక్టర్లు రాసిన మందులు,క్రీములు ఇలా అన్నీ ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. డాక్టర్లు చేసిన పరీక్షల్లో ఆమెకున్న క్రోనిక్‌ లెగ్‌ అల్సర్‌ కాస్తా గ్యాంగ్రెనే(దెబ్బతిన్న శరీర భాగం కుళ్లిపోయే స్థితి)గా మారిందని తేలింది. ఆమెకు డయాబెటిస్‌ ఉండటంతో గాయం మానటం కష్టమని, కాలును తీసేయటం మంచిదని డాక్టర్లు సలహాయిచ్చారు. డాక్టర్ల సలహా మేరకు ఆమె తన కుడి కాలును తీసేయించుకుంది. నిర్లక్ష్యమే తన ఈ పరిస్థికి కారణమని ఏ పరిస్థితిలోనూ నిర్లక్ష్యం కూడదని తాన్యా సలహా ఇస్తోంది.