పంజాబ్‌ మూడో ఓటమి

ఐపీఎల్‌లో ఏడు మ్యాచ్‌లు ఓడితే ప్లేఆఫ్‌ అవకాశాలకు దాదాపుగా తెరపడ్డట్లే. ఈ సీజన్లో ఆరు మ్యాచ్‌లు ఓడిన ముంబయి మెడపై ఇప్పటికే కత్తి వేలాడుతోంది. ఒక్క మ్యాచ్‌ ఓడినా ప్లేఆఫ్‌ రేసుకు దాదాపు దూరమైనట్లే. ఈ స్థితిలో ఆ జట్టు పట్టుదల ప్రదర్శించింది. శుక్రవారం మొహాలిలో జరిగిన మ్యాచ్‌లో అన్ని విభాగాల్లో రాణించి కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ను ఓడించింది. తొమ్మిది మ్యాచ్‌ల్లో ఆ జట్టుకిది మూడో విజయం. ఎనిమిదో మ్యాచ్‌ ఆడిన పంజాబ్‌ మూడో ఓటమి చవిచూసింది.
ఇండోర్‌
ముంబయి ఇండియన్స్‌ సరైన సమయంలో సత్తా చాటింది. పంజాబ్‌ను 6 వికెట్ల తేడాతో మట్టికరిపించింది. 175 పరుగుల లక్ష్యాన్ని ఆ జట్టు 19 ఓవర్లలో 4 వికెట్లే కోల్పోయి ఛేదించింది. సూర్యకుమార్‌ యాదవ్‌ (57; 42 బంతుల్లో 6×4, 3×6), కృనాల్‌ పాండ్య (31 నాటౌట్‌; 12 బంతుల్లో 4×4, 2×6) జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. అంతకుముందు క్రిస్‌ గేల్‌ (50; 40 బంతుల్లో 6×4, 2×6), స్టాయినిస్‌ (29 నాటౌట్‌; 15 బంతుల్లో 2×4, 2×6) రాణించడంతో 6 వికెట్లకు 174 పరుగులు చేసింది. బుమ్రా (1/19), మయాంక్‌ మార్కండే (1/29) పంజాబ్‌కు కళ్లెం వేశారు.

ఉత్కంఠ రేగినా..: ఛేదనలో ముంబయికి సూర్యకుమార్‌ మంచి ఆరంభాన్నిచ్చాడు. లూయిస్‌ (10) విఫలమైనా.. అతను చెలరేగిపోయాడు. తనే ఎక్కువగా స్ట్రైక్‌ తీసుకుంటూ.. చక్కటి షాట్లు ఆడుతూ ఛేదనను నడిపించాడు. క్రీజులో కుదురుకున్నాక ఇషాన్‌ కిషన్‌ (25; 19 బంతుల్లో 3×6) కూడా మెరుపు సిక్సర్లతో అలరించాడు. సూర్యకుమార్‌ను ఔట్‌ చేయడం ద్వారా స్టాయినిస్‌ ఈ జోడీని విడదీశాడు. ముజీబ్‌ రెహ్మాన్‌ ప్రమాదకరంగా మారుతున్న ఇషాన్‌ను ఔట్‌ చేయడమే కాక పరుగులు కట్టడి చేసి ముంబయిపై ఒత్తిడి పెంచాడు. 4 ఓవర్లలో 50 పరుగులు చేయాల్సి రావడంతో ఉత్కంఠ నెలకొంది. ఐతే కృనాల్‌ పాండ్య.. ముజీబ్‌ సహా వరుసగా పంజాబ్‌ బౌలర్లను ఉతికారేస్తూ ముంబయికి సునాయాస విజయాన్నందించాడు. రోహిత్‌ (24 నాటౌట్‌) కూడా సత్తా చాటడంతో ఒక ఓవర్‌ ఉండగానే ముంబయి పని పూర్తయింది.
పడుతూ లేస్తూ..: అంతకుముందు పంజాబ్‌ ఇన్నింగ్స్‌ ఒడుదొడుకులతో సాగింది. ఓపెనర్లు గేల్‌, రాహుల్‌ (24) ఆ జట్టుకు మంచి ఆరంభాన్నే ఇచ్చారు. మరీ విధ్వంసకరంగా ఆడకపోయినా వీలు చిక్కినపుడల్లా షాట్లు ఆడుతూ స్కోరు బోర్డును నడిపించారు. ఏడో ఓవర్లో రాహుల్‌ ఔటయ్యే సమయానికి స్కోరు 54. గేల్‌ కొన్ని కళ్లు చెదిరే షాట్లతో అభిమానుల్ని అలరించాడు. మెక్లెనగన్‌ బౌలింగ్‌లో అతనాడిని పుల్‌ షాట్‌కు బంతి స్టేడియం అవతల పడటం విశేషం. ఐతే గేల్‌ అప్పుడప్పుడూ షాట్లు ఆడినా.. చాలా బంతులే వృథా చేశాడు. అతను 40 బంతుల్లో 50 చేసి ఔటయ్యాడు. రాహుల్‌ ఔటయ్యాక వచ్చిన యువరాజ్‌ (14) బాగా ఇబ్బంది పడ్డాడు. స్ట్రైక్‌ రొటేట్‌ చేయలేకపోయాడు. దీంతో రన్‌రేట్‌ 8 లోపే సాగింది. గేల్‌, యువీ వరుస ఓవర్లలో వెనుదిరగ్గా.. కరుణ్‌ నాయర్‌ (12 బంతుల్లో 23; 1×4, 2×6) ధాటిగా ఆడుతూ స్కోరు బోర్డులో కదలిక తెచ్చాడు. ముంబయి బౌలర్లు కరుణ్‌, అక్షర్‌ పటేల్‌ (13)లను స్వల్ప వ్యవధిలో ఔట్‌ చేయడమే కాక.. చివరి ఓవర్లలో చక్కగా బౌలింగ్‌ చేసి పంజాబ్‌ను కట్టడి చేశారు. ఐతే హార్దిక్‌ వేసిన చివరి ఓవర్లో స్టాయినిస్‌ (29 నాటౌట్‌) రెండు సిక్సర్లు, రెండు ఫోర్లు బాది 22 పరుగులు రాబట్టడంతో ముంబయి ముందు కింగ్స్‌ మెరుగైన లక్ష్యాన్నే నిలిపింది.