పన్ను కట్టడంలోను ధోని రికార్డు..

MS Doni

MS Doni

మైదానంలో తనదైన మార్క్‌ను చూపెట్టే టీమిండియా మాజీ కెప్టెన్‌, సీనియర్‌ క్రికెటర్‌ మహేంద్ర సింగ్‌ ధోని ఆదాయపు పన్ను కట్టడంలోను రికార్డు సృష్టించాడు. 2017-18 ఆర్థిక సంవత్సరంలో ధోని ఏకంగా రూ.12.17 కోట్ల ఆదాయపు పన్ను కట్టాడు. దీంతో జార్ఖండ్‌లో అత్యధిక ట్యాక్స్‌ పే చేసిన వ్యక్తిగా గుర్తింపు పొందాడు. 2016-17తో పోలిస్తే ఇది 1.24 కోట్లు ఎక్కువ అని జార్ఖండ్‌ ఇన్‌కమ్‌ టాక్స్‌ అధికారులు పేర్కొన్నారు. పన్ను చెల్లించడమే కాకుండా, రానున్న వార్షిక ఆదాయానికి సంబంధించి సుమారు మూడు కోట్ల రూపాయల అడ్వాన్స్ ట్యాక్స్‌ను ముందే డిపాజిట్ కూడా చేసినట్లు తెలిపారు.

2017లో ధోని రూ.10.93 కోట్ల పన్ను కట్టాడు. ఫోర్బ్స్‌ ప్రకటించిన ఎక్కువగా ఆర్జించే భారత క్రికెటర్ల జాబితాలో ధోని మూడోస్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. తొలి రెండు స్థానాల్లో కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి, మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌లున్నారు. ఇక 2017 ఫోర్బ్స్‌ సెలబ్రిటీల లిస్టులో ధోని ఎనిమిదో స్థానంలో నిలిచాడు. అతను ఆ ఏడాది రూ. 63.7 కోట్లు ఆర్జించాడు. 2017లో ధోని సెవెన్‌ అనే బ్రాండ్‌తో దుస్తుల మార్కెట్లలోకి ప్రవేశించిన విషయం తెలిసిందే. ఇక హాకీ ఇండియా లీగ్‌లో రాంచీ రేస్‌, ఇండియన్‌ సూపర్‌ బాల్‌ లీగ్‌లో చెన్నై ఎఫ్‌సీ ఫుట్‌బాల్‌ ఫ్రాంచైజీలకు ధోని సహయజమానిగా వ్యవహరిస్తున్నాడు. ఇక ఐపీఎల్‌లో ధోని చెన్నైకి టైటిల్‌ అందించిన విషయం తెలిసిందే. అయితే ఇటీవల ఇంగ్లండ్‌ పర్యటనలో మ్యాచ్‌ అనంతరం అంపైర్‌ నుంచి బంతి తీసుకోవడంతో ఈ క్రికెటర్‌ రిటైర్మెంట్‌ తీసుకుంటున్నాడనే ప్రచారం జోరుగా సాగింది. అతని ఆట పట్ల కూడా విమర్శలు వ్యక్తమయ్యాయి.