పాలివ్వని ఆవులు అమ్మారంటూ వృద్ధుడి హత్య..

పాలు సరిగ్గా ఇవ్వని ఆవులను అమ్మారంటూ 65 ఏళ్ల వృద్ధుడిని చితకబాదడంతో మరణించిన ఘటన రాజస్తాన్‌లో చోటుచేసుకుంది. ధనలాల్‌ గుజర్‌ అనే వ్యక్తి తనకు అమ్మిన ఆవు సరిగ్గా పాలు ఇవ్వడం లేదని ప్రకాష్‌ గుజర్‌ (30) కర్రతో దాడికి తెగబడటంతో బాధిత వృద్ధుడు మరణించిన ఘటన వరుణ్‌ జిల్లాలో వెలుగు చూసిందని పోలీసులు తెలిపారు.

తీవ్ర గాయాలైన ధనలాల్‌ను జిల్లా ఆస్పత్రి నుంచి కోట ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడని పోలీసులు వెల్లడించారు.ధనలాల్‌ కుమారుడు ప్రకాష్‌ కుటుంబానికి కొన్ని ఆవులు విక్రయించగా, అవి సరిగ్గా పాలు ఇవ్వడం లేదని ఇరు కుటుంబాల మధ్య వాగ్వాదం చెలరేగి హత్యకు దారితీసిందని పోలీసులు తెలిపారు. నిందితుడు ప్రకాష్‌ గుజర్‌పై హత్య కేసు నమోదు చేసిన పోలీసులు అతడి కోసం గాలిస్తున్నారు.