పెరిగినా బంగారం ధర

మేలిమి బంగారం 10 గ్రాముల ధర బుధవారం రూ.225 పెరిగి, రూ.32,450కి చేరింది. అంతర్జాతీయంగా గిరాకీ బలహీనంగా ఉన్నా, పెళ్లిళ్ల దృష్ట్యా దేశీయంగా ఆభరణాల విక్రేతలు కొనుగోళ్లు జరపడమే ఇందుకు కారణం. ఆభరణాల బంగారం (916 స్వచ్ఛత) సెవరు (8 గ్రాములు) రూ.24,800గా ఉంది. వెండి కూడా కిలోకు రూ.200 పెరిగి, రూ.40,700కు చేరింది. పారిశ్రామిక అవసరాలు, నాణేల తయారీకి కొనుగోళ్లు అధికంగా జరపడమే ఇందుకు కారణం. రూపాయి మారకం విలువ మరింత బలహీనపడి, డాలర్‌ రూ.66.82కు చేరడం కూడా, దేశీయంగా పసిడి, వెండి ధరలు పైపైకి చేరేందుకు దోహదపడుతున్నాయి.
అంతర్జాతీయ విపణిలో ఔన్సు (31.10 గ్రాముల) ధర 0.38 శాతం తగ్గి 1,324.70 డాలర్లకు, ఔన్సు వెండి ధర 0.42 క్షీణించి, 16.60 డాలర్లకు పరిమితమయ్యాయి. డాలర్‌ బలపడటం వల్ల, ఈ లోహాలపై పెట్టుబడులు తగ్గడమే ఇందుకు కారణం. అంతర్జాతీయ విపణి ప్రకారం చూస్తే, దేశీయంగా మేలిమిబంగారం ధర 10 గ్రాములు రూ.32,170 అవుతుంది. అయితే దేశీయంగా 10 గ్రాములకు రూ.280 అధికంగా ఉంది. పెళ్లిళ్ల సీజన్‌ కొనసాగుతున్నందున, వ్యాపారులు లోహాన్ని అధికంగా కొనుగోలు చేయడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని చెబుతున్నారు.