పెళ్లి వేడుకలో రష్యన్‌ యువతులతో నృత్యాలు

పాతబస్తీలో కొందరు పాశ్చాత్య సంస్కృతికి శ్రీకారం చుట్టారు. పెళ్లి వేడుకలకు ఏకంగా రష్యన్‌ యువతులను రప్పించి బెల్లి డ్యాన్స్‌లు చేయించారు. ఆట పాటలతో హోరెత్తిస్తుండడంతో అసౌకర్యానికి గురైన స్థానికులు ఇచ్చిన ఫిర్యాదుతో నిర్వాహకులపై కేసులు నమోదయ్యాయి. యువతులను మాత్రం చాకచక్యంగా అక్కడినుంచి తప్పించారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. బండ్లగూడలోని నూరీ ప్యాలెస్‌ ఫంక్షన్‌ హాల్‌లో శనివారం రాత్రి బార్కాస్‌ ప్రాంతానికి చెందిన బహమాద్‌ వంశస్తుల వివాహం జరిగింది. ఈ సందర్భంగా వారు ఎనిమిది మంది రష్యన్‌ యువతులను రప్పించి బెల్లి డ్యాన్స్‌లు చేయించారు. వారిపై నోట్లు విసురుతూ నానా రభసా చేయడంతో అసౌకర్యానికి గురైన స్థానికులు డయల్‌–100కు సమాచారం అందించారు.

చాంద్రాయణగుట్ట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునేలోగా నిర్వాహకులు సదరు యువతులను అక్కడి నుంచి తప్పించారు. పోలీసులు పెళ్లి కుమారుడు యాహ్యా బా అహ్మద్, అతని సోదరుడు అబ్దుల్‌ బా అహ్మద్, ఫంక్షన్‌హాల్‌ యజమాని ఈసా మిశ్రీ, మేనేజర్‌ తాహెర్‌ షా, ఆర్కెస్ట్రా నిర్వాహకుడు మహ్మద్‌ వసీం, అబ్దుల్లా అనే వ్యక్తులపై కేసులు నమోదు చేశారు. వారిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇన్‌స్పెక్టర్‌ నవీన్‌ ఫంక్షన్‌హాళ్ల నిర్వాహకులతో సమావేశం నిర్వహించి నియమ నిబంధనలపై అవగాహన కల్పించారు.