పేరు మార్చుకున్నా బాలీవుడ్‌ నటి..

బాలీవుడ్‌ నటి సోనమ్‌కపూర్‌ ఇటీవల ఓ ఇంటివారైన సంగతి తెలిసిందే. దిల్లీకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్‌ అహూజాతో సోనమ్‌ వివాహం ఘనంగా జరిగింది. వివాహ వేడుకకు, విందుకు ఎందరో సినీ ప్రముఖులు హాజరై సందడి చేశారు. అయితే పెళ్లైన గంటలోనే సోనమ్‌ సోషల్‌మీడియాలో తన పేరును ‘సోనమ్‌ కె.అహూజా’ అని మార్చేశారు.
దాంతో ఇది కాస్తా వైరల్‌గా మారింది. సోనమ్‌ పేరు మార్చుకుంది అంటూ హెడ్‌లైన్స్‌ వచ్చేశాయి. దీని గురించి సోనమ్‌ స్పందిస్తూ..‘నా గురించి ఇతరులు ఏం మాట్లాడుకుంటున్నారో నాకు అనవసరం. నేను నాలా ఉండాలని అనుకుంటున్నా. ఈ ఏడాది కేన్స్‌ వేడుకకు మా వారితో కలిసి వచ్చాను. అయినా నాకు ప్రత్యేకంగా ఏమీ అనిపించలేదు. అంతా ఒకేలా ఉంది. పెళ్లి తర్వాత జీవితం పూర్తిగా మారిపోతుంది అనుకోవడం అపోహ. మహిళలు ఆ విధంగా ఆలోచించడం మానుకోవాలి. నేను ఫెమినిస్ట్‌ని. నాకు నచ్చినట్లుగా నా పేరు మార్చుకుంటాను. నా పేరులో కపూర్‌ కూడా ఉంది. అది మా నాన్న పేరు. కాబట్టి నాన్న పేరుతో పాటు మా వారి పేరు కూడా కలుపుకోవాలని అనుకున్నాను. అందులో తప్పేముంది? ఆనంద్‌ కూడా తన పేరును ‘ఆనంద్‌ ఎస్‌ అహూజా’ అని మార్చుకున్నారు. దాని గురించి ఎవ్వరూ రాయరేం? నా జీవితానికి సంబంధించి నేనే అన్ని నిర్ణయాలు తీసుకుంటాను. అంతేకానీ నాకు ఎవరూ గన్ను గురిపెట్టి బలవంతంగా చేయించరు.’ అని చెప్పుకొచ్చారు సోనమ్‌.
వివాహమయ్యాక సోనమ్‌ ఆనంద్‌తో కలిసి ఫ్రాన్స్‌కు వెళ్లారు. అక్కడ జరుగుతున్న కేన్స్‌ ఫెస్టివల్‌లో పాల్గొని సందడి చేశారు. కొన్ని రోజుల తర్వాత సోనమ్‌..‘వీరే ది వెడ్డింగ్‌’ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటారు. త్వరలో ఆమె తన తండ్రితో కలిసి ‘ఏక్‌ లడికీ కో దేఖాతో ఐసా లగా’ చిత్రంలో నటించనున్నారు.