పొట్ట తీసేసేముందు ఒక్కసారి బిర్యానీ తింటా

గులామ్‌ అబ్బాస్‌.. దుబాయ్‌ ఓ ఇంజనీర్‌. ఈ వ్యక్తికి అకస్మాత్తుగా వాంతులు, భారీగా బరువు తగ్గిపోవడం జరిగింది. అసలేమైందో తెలియదు. కానీ అకస్మాత్తుగా తన శరీరంలో సంభవించిన ఈ మార్పులతో అబ్బాస్‌ ఒక్కసారిగా షాకైపోయాడు. వెంటనే డాక్టర్లను ఆశ్రయించాడు. డాక్టర్లు చెప్పిన విషయం తెలిసి కన్నీరుమున్నీరయ్యాడు. మూడు స్టేజ్‌ క్యాన్సర్‌ తన కడుపునంతా పాకేసిందని, ఇక బతకడం కష్టమని చెప్పారు. బతకాలంటే, తప్పనిసరి పరిస్థితుల్లో పొట్టను తీసేయాల్సిందేనని డాక్టర్లు సూచించారు. పొట్ట లేకుండా మనుగడ సాధించడం లేదా చనిపోవడం ఈ రెండే మార్గాలని డాక్టర్లు చెప్పారు. అయితే తన పిల్లలు తాను లేకుండా బతకాలని కోరుకోవడం లేదని, వారి లక్ష్యాలను తాను కళ్లారా చూడాలని కోరిక ఉందని, ఎలాగైనా తను బతకాలని అబ్బాస్‌ డాక్టర్లకు చెప్పాడు. అబ్బాస్‌ కోరిక మేరకు క్యాన్సర్‌ ప్రభావితమైన పొట్టను తొలగించడానికే డాక్టర్లు మొగ్గుచూపారు. అయితే సర్జరీ చేసే ముందు తన చిన్న కోరిక తీర్చాలని డాక్టర్లను వేడుకున్నాడు. అదేమిటంటే.. ఇక జన్మలో తనకు ఇష్టమైన తన భార్య చేసిన బిర్యానీ తినడం కుదరదు కాబట్టి, సర్జరీ చేసి పొట్టను తొలగించే ముందే ఒక్కసారి బిర్యానీ తినాలని కోరుకుంటున్నట్టు చెప్పాడు.

అబ్బాస్‌ కోరికను డాక్టర్లు కూడా నెరవేర్చారు. కడుపు క్యాన్సర్‌ ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్న క్యాన్సర్‌ సంబంధిత మరణాల్లో ఒకటిగా ఉంది. ఇలాంటి కేసులు ఈమధ్యన నమోదవుతూనే ఉన్నాయి. యువతకు ఈ క్యాన్సర్‌ ఎక్కువగా విస్తరిస్తుందని డాక్టర్లు చెప్పారు. అయితే ప్రస్తుతం ప్రతి ఒక్కరినీ కదిలిస్తున​ ఒకే ఒక్క ప్రశ్న…. పొట్ట లేకుండా అబ్బాస్‌ ఎలా బతకగలడు అని. అయితే పొట్ట లేకుండా బతకడమంటే.. అసలు తినకపోవడం కాదని, స్పైసీగా లేని, తక్కువ మొత్తంలో ఆహారం అబ్బాస్‌ తీసుకోగలగడని డాక్టర్లు చెబుతున్నారు. పొట్ట లేకుండా ఉన్న వారు తీసుకునే ఆహారాన్ని అన్నవాహిక నుంచి నేరుగా చిన్న ప్రేగులకు తరలించవచ్చని కన్సల్టెంట్‌ లాపరోస్కోపిక్ సర్జన్ డాక్టర్‌ అల్ మర్జూకీ తెలిపారు. తాము పెద్ద ప్రేగు క్యాన్సర్‌ సర్జరీలు చాలా చేశామని, కానీ పొట్టమొత్తం తీసేసే సర్జరీని చేయడం ఇదే తొలిసారని డాక్టర్‌ తెలిపారు.