పోర్న్ స్టార్ ను ట్రంప్ అరెస్ట్ చేయించారా?

పోర్న్ స్టార్ స్టెఫానీ క్లిఫోర్డ్ అలియాస్ స్టోర్మీ డేనియల్స్ గుర్తుందా? అదేనండి.. ట్రంప్ అమెరికా అధ్యక్షుడు కాకముందు తనతో అఫైర్ నడిపారంటూ సంచలన ఆరోపణలు చేయటంతో పాటు.. ఆ విషయాన్ని అధ్యక్ష ఎన్నికలకు ముందు బయటకు చెప్పకుండా ఉండేందుకు వీలుగా తనతో డీల్ కుదుర్చుకున్నట్లుగా ఆమె చెప్పిన వైనం పెను దుమారానికి కారణమైంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇబ్బందుల్లో చిక్కుకున్నారు.

ఇలా తన మాటలతో ట్రంప్ ను ఇబ్బందులకు గురి చేసిన స్టోర్మీని తాజాగా పోలీసులు అరెస్ట్ చేయటం కలకలం రేపింది. ఒహియో రాష్ట్రంలోని క్లబ్ లో ఆమె స్ట్రిప్పింగ్ డ్యాన్సులు చేస్తూ.. కొందరితో అసభ్యంగా ప్రవర్తించిందన్న ఆరోపణల మీద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ట్విస్ట్ ఏమిటంటే.. ఆమెను అలా అరెస్ట్ చేసి జైలుకు తరలించారో లేదో.. గంటల వ్యవధిలోనే ఆమెను తిరిగి విడుదల చేయటం.

ఎందుకిలా అంటే.. ట్రంప్ మీద ఉన్న స్వామి భక్తితో కొందరు అధికారుల అత్యుత్సాహమే ఈ అరెస్ట్‌కు కారణంగా చెబుతున్నారు. ఈ వాదనకు బలం చేకూరేలా కొన్ని అంశాల్ని పలువురు ప్రస్తావిస్తున్నారు. డిటెక్టివ్ లు మారువేషంలో క్లబ్‌కు వెళ్లాల్సిన అవసరం ఏముందన్న ప్రశ్నతో పాటు.. నైట్ క్లబ్ లో సభ్యత్వం ఉన్న డ్యాన్సర్ కావటంతో స్టోర్మీపై చేసిన ఆరోపణల్ని కోర్టు ఒప్పుకోదంటున్నారు.

ట్రంప్ మీద ఆమె చేసిన ఆరోపణలకు ప్రతీకారం తీర్చుకునేందుకే పోలీసులు ఇలా వ్యవహరించి ఉంటారన్న మాట బలంగా వినిపిస్తోంది. దీంతో డిఫెన్స్ లో పడ్డ అధికారులు వివరణ ఇస్తూ.. డ్రగ్స్.. వ్యభిచారం జరుగుతుందన్న సమాచారం మేరకే తాము సీక్రెట్‌గా స్టింగ్ ఆపరేషన్ నిర్వహించినట్లుగా చెబుతున్నారు. స్టోర్మీ అరెస్ట్ వ్యవహారం మీడియాలో ప్రముఖంగా రావటం.. ట్రంప్ తో ఆమెకున్న పంచాయితీ కారణంగానే ఆమెపై ఆక్రమంగా కేసులు పెట్టి ఉంటారన్న వాదన బలంగా వినిపిస్తోంది.

ఇదే.. ఆమెను అరెస్ట్ చేసిన గంటల వ్యవధిలోనే విడుదల చేయటానికి కారణమని చెబుతున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఇప్పటివరకూ ఈ వ్యవహారంపై మౌనంగా ఉన్న ఆమె నోరు విప్పితే మరిన్నిసంచలనాలు చోటు చేసుకునే వీలుందని చెబుతున్నారు. మరోవైపు ఆమెపై చేసిన ఆరోపణలకు తన వాదనను వినిపించేందుకు వీలుగా తన న్యాయవాదులతో కలిసి కోర్టుకు హాజరవుతారని చెబుతున్నారు.