పోలీస్‌ స్టేషన్ దాడిపై… గుంటూరులో 144 సెక్షన్‌

బాలికపై అత్యాచారయత్నం ఘటనతో పాత గుంటూరులో అర్థరాత్రి తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఓ బాలికపై యువకుడు అత్యాచారయత్నం చేశాడు. ఈ ఘటన పాత గుంటూరులో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. నిందితుడు రఘును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విషయం తెలుసుకున్న బాధితురాలి కుటుంబ సభ్యులు, బంధువులు పోలీస్‌ స్టేషన్‌కు తరలివచ్చారు. ఈ దారుణానికి పాల్పడిన నిందితుడిని ఉరి తీయాలని డిమాండ్‌ చేస్తూ పోలీస్‌ స్టేషన్‌ వద్ద భీభత్సం సృష్టించారు.

ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలీస్‌ స్టేషన్‌పై దాడి చేయడమే కాకుండా, అక్కడున్న వాహనాలకు నిప్పుపెట్టారు. ఈ దాడిలో పలువురు పోలీసులు గాయపడినట్లు తెలుస్తోంది. దీంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పాత గుంటూరు 144 సెక్షన్‌ విధించారు. పోలీస్‌ స్టేషన్ దాడిపై ఉన్నతాధికారులు సీరియస్‌ అయ్యారు. దీనిపై పోలీసులు ఆరు కేసులు నమోదు చేశారు. నిందితులను గుర్తించేందుకు అధికారులు ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేశారు. మరోవైపు అత్యాచారయత్నం చేసిన నిందితుడు రఘును అరెస్టు చేసిన పోలీసులు కోర్టులో హాజరు పరిచారు.