ప్రజలకి న‌మ్మ‌కం లేదు: మంత్రి హరీశ్‌రావు

ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ప్రజలు విశ్వాసంతో ఉన్నారని, తెజస అధ్యక్షుడు కోదండరాం మాటలను ప్రజలు నమ్మరని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. సోమవారం సిద్దిపేట జిల్లా ములుగు మండలం తున్కిబొల్లారంలో కొండపోచమ్మ జలాశయం ముంపు బాధితులకు నిర్మిస్తున్న రెండు పడక గదుల ఇళ్ల పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. రైతుల కోసం నీళ్లు తేవాలనే లక్ష్యంతో కొండపోచమ్మ జలాశయ నిర్మాణం చేపడుతుంటే తెఐకాస కుట్రలో భాగంగా దొడ్డిదారిన వచ్చి పనులు అడ్డుకునే ప్రయత్నం చేశారన్నారు. ఇది చాలా బాధాకరమైన విషయమని, మేధావి అయిన కోదండరాంకు ఇది తగునా అంటూ మండిపడ్డారు. ఈ జలాశయం కింద 4636 ఎకరాల భూమి ముంపునకు గురవుతుండగా ఇప్పటికే 4468 ఎకరాలు సేకరించామన్నారు. ప్రజలకు ఇచ్చిన మాట నిలుపుకొనే వ్యక్తి సీఎం కేసీఆర్‌ అని వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వ హయాంలో 2013 భూసేకరణ చట్టం ప్రకారం ఐఏవై ఇళ్లు 125 గజాల స్థలంలో రూ. లక్ష రుణ సదుపాయంతో చేసేవారని, తెరాస ప్రభుత్వం నిర్వాసితుల పక్షాన ఉంటుందని, సకల సౌకర్యాలతో దేశంలోనే ఎక్కడా లేనివిధంగా చరిత్రలో నిలిచిపోయేలా ఆదర్శవంతమైన కాలనీని నిర్మిస్తున్నామన్నారు.