ప్రజా సంకల్పయాత్ర @ 2,500 కిలోమీటర్లు

‘నాన్న గారు చనిపోయినప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. ఒక కొడుకుగా చాలా బాధ పడ్డాను. కానీ ఆ బాధలో నుంచి బయటికి రావడానికి కారణం నాన్న గారు ఎక్కడికీ పోలేదని.. ప్రతి గుండెలోనూ బతికే ఉన్నారనే ధీమా.. నాకు ఇంత పెద్ద కుటుంబాన్ని (ప్రజలు)ఇచ్చాడన్న ధైర్యం, భరోసాలే నన్ను నడిపిస్తున్నాయి.’ పశ్చిమగోదావరి జిల్లాలో పాదయాత్ర 2,000 కిలోమీటర్ల మైలురాయిని అధిగమించినపుడు ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్న మాటలివి. ఆ మాటలు అక్షర సత్యమని నిరూపిస్తూ జననేత చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర పాలకుల గుండెల్లో గుబులు రేపుతూ అప్రతిహతంగా సాగిపోతోంది.

తూర్పుగోదావరి జిల్లా పసలపూడి శివారులో ఆదివారం 208వ రోజు పాదయాత్ర 2,500 కిలోమీటర్ల మైలు రాయిని అధిగమించింది. సరిగ్గా ఈ రోజే దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి జయంతి రోజు కావడం యాదృచ్ఛికం. తనకు ఇంతటి భారీ కుటుంబాన్ని ఇచ్చి కనిపించని లోకాలకు వెళ్లిన తండ్రిని ఉదయాన్నే స్మరించుకున్నారు. బాధను దిగమింగుకుని శిబిరంలో ఏర్పాటు చేసిన తన తండ్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం వైఎస్‌ జయంతిని పురస్కరించుకుని తయారు చేసిన భారీ కేక్‌ను పార్టీ నేతలు, అభిమానుల మధ్య ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ చేత కట్‌ చేయించారు. వేద పండితుల ఆశీర్వాదం పొందారు. తన వెంటే జనం రూపంలో మహానేత ఉన్నారనే నిబ్బరంతో యథావిధిగా తను బస చేసిన శిబిరం నుంచి పాదయాత్రగా బయలుదేరారు.

శిబిరం నుంచి బయటకు రాగానే ప్రజల నుంచి జగన్‌కు అనూహ్యమైన స్పందన లభించింది. పసలపూడి మొదలు చెల్లూరు, మాచవరం, సోమేశ్వరం వరకూ జనమే జనం. మహిళలు పెద్ద సంఖ్యలో ఆయనకు ఎదురేగి హారతులు పట్టారు. వృద్ధులు దీవెనలు అందజేశారు. అన్నొచ్చారంటూ యువతీ యువకులు సంతోషంతో జైజగన్‌ నినాదాలు చేశారు. రామచంద్రాపురం నియోజకవర్గం దాటుకుని మండపేట నియోజకవర్గంలోకి జననేత ప్రవేశించినపుడు సంఘీభావం ప్రకటించడానికి వచ్చిన జనంతో ఆ ప్రాంతం కిక్కిరిసింది. జననేత అడుగు తీసి అడుగు వేయడానికి అభిమానం అడ్డుపడింది. దీంతో యాత్ర బాగా ఆలస్యంగా ముందుకు సాగింది. జగన్‌తో మాట్లాడాలని, కరచాలనం చేయాలని, సమస్యలు చెప్పుకుని ఊరట పొందాలని వివిధ వర్గాల ప్రజలు అసంఖ్యాకంగా తరలి వచ్చారు. ఆదివారం సాయంత్రం పాదయాత్ర ముగిసే ప్రాంతానికి సమీపంలోని సోమేశ్వరం సెంటర్‌ బహిరంగ సభను తలపిస్తూ కిటకిటలాడింది. వేలాది మంది జనం దివంగత ముఖ్యమంత్రిని స్మరించుకుంటూ జననేత అడుగులో అడుగు వేశారు.

Source : Click here