ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిపై హత్యాయత్నం

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిపై హత్యాయత్నం జరగడం పట్ల వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఫల్యం కారణంగానే.. అత్యంత భద్రత కలిగిన ప్రాంతంలోనే వైఎస్‌ జగన్‌పై కత్తితో దాడి జరిగిందని విమర్శించారు. ఇటువంటి హేయమైన చర్యకు ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు. వైఎస్‌ జగన్‌కు ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేకనే టీడీపీ ఇలాంటి దిగజారుడు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. మహానేత రాజశేఖర రెడ్డి లేని లోటునే భరించలేకపోతుంటే.. జగన్‌ను చంపేందుకు కుట్ర జరగడం దారుణమంటూ పలువురు కార్యకర్తలు కన్నీరుమున్నీరవుతున్నారు.

టీడీపీ దోషుల్ని పెంచిపోషిస్తోంది : పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి
వైఎస్‌ జగన్‌పై కత్తితో దాడి జరగడం పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమేనని వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ దోషుల్ని పెంచి పోషిస్తోందని ఆరోపించారు. నిందితులు ఎవరైనా వదిలి పెట్టకూడదని, దీనంతటికీ ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. ఎయిర్‌పోర్టులోకి కత్తులను ఎలా అనుమతిస్తారని, దాడి జరుగుతున్న సమయంలో భద్రతా సిబ్బంది ఏం చేస్తోందంటూ ప్రశ్నించారు.

క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టాలి
విశాఖ ఎయిర్‌పోర్టులో వైఎస్ జగన్‌పై కత్తితో దాడి చేయడం హేయమైన చర్య అని రాజంపేట వైస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పార్లమెంటరీ అధ్యక్షుడు ఆకేపాటి అమర్‌నాథ్‌ రెడ్డి అన్నారు. దీనిపై క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి నిందితులకు వెంటనే సరైన శిక్ష వేయాలని డిమాండ్‌ చేశారు. ప్రజాసంకల్పయాత్రలో వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డికి వస్తున్న జనాదరణ చూసి ఓర్వలేకే ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు.