ప్రియాంక, నిక్‌ జోనస్‌ సంపాదనెంతో తెలుసా…

బాలీవుడ్‌ నటి ప్రియాంక చోప్రా, అమెరికన్‌ సింగర్‌ నిక్‌ జోనస్‌ల ప్రేమాయణం త్వరలో పెళ్లి పీటలెక్కబోతుంది. వీరిద్దరి నిశ్చితార్థం అయిపోయినట్టు అమెరికన్‌ మీడియా ధృవీకరించింది. గత వారం ప్రియాంక చోప్రా పుట్టిన రోజు నాడు, నిక్‌ జోనస్‌తో ఆమె నిశ్చితార్థం జరిగినట్టు అమెరికన్‌ మీడియా చెబుతోంది. వెరీ స్పెషల్‌ కారణంతో, ప్రియాంక, భరత్‌ అనే చిత్రం నుంచి తప్పుకున్నారని.. నిక్‌, ప్రియాంకల పేరును పరోక్షంగా ప్రస్తావిస్తూ ఆ సినిమా డైరెక్టర్‌ అలీ అబ్బాస్‌ జఫర్‌ ట్వీట్‌ చేయడంతో, వీరి వివాహంపై ఈ డైరెక్టర్‌ కూడా పెద్ద హింటే ఇచ్చాడని బాలీవుడ్‌ వర్గాలు గుసగుసలాడుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రియాంక, నిక్‌ జోనస్‌ల సంపాదనెంత ఉండొచ్చు అనే దానిపై రిపోర్టులు వెలువడుతున్నాయి.

ప్రియాంక, జోనస్‌లు వారి వారి రంగాల్లో అగ్రగామిలో ఉన్నారు. ఫోర్బ్స్‌ రిపోర్టు ప్రకారం, ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన మహిళలో ప్రియాంక 97వ స్థానంలో ఉన్నారు. 2017 నవంబర్‌ నాటికి ఆమె సంపాదన సుమారు 10 మిలియన్‌ డాలర్లు అంటే రూ.64 కోట్లు ఉన్నట్టు రిపోర్టు వెల్లడించింది. మరోవైపు డైలీ మెయిల్‌ అంచనాల ప్రకారం నిక్‌ జోనస్‌ సంపాదన 25 మిలియన్‌ డాలర్లని అంటే భారత కరెన్సీ ప్రకారం రూ.171 కోట్లగా ఉందని తెలిసింది. ఈ రిపోర్టులు వెలువడి కొన్ని రోజులే కావడంతో, వీరి సంపాదనలో పెద్దగా మార్పులేమీ చోటు చేసుకుని ఉండకపోవచ్చని తెలుస్తోంది. దీంతో మొత్తంగా కలిపి ప్రియాంక, నిక్‌ జోనస్‌ల సంపాదన రూ.235 కోట్లని వెల్లడవుతోంది.

కాగ, ప్రియాంక చోప్రా, నిక్ జోనస్‌ల ప్రేమ కథ 2017 మెట్‌ గలాలో మొదలైంది. నిక్‌ జోనస్‌, ప్రియాంక కంటే పదేళ్ల చిన్న. ఇటీవలే నిక్‌ జోనస్‌ను ప్రియాంక భారత్‌కు తీసుకుని వచ్చి, తన కుటుంబానికి పరిచయం చేసింది. నిక్‌ జోనస్‌ కూడా ప్రియాంకను వారి కుటుంబానికి పరిచయం చేయడంతో, వారి ప్రేమ కథకు ఇరు కుటుంబాల నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ పడిందని తెలుస్తోంది. ఇరు కుటుంబాలు ఒప్పుకోవటంతో సీక్రెట్‌గా ఎంగేజ్‌మెంట్‌ జరిగిందని, త్వరలో వీరిద్దరూ వివాహానికి సిద్ధమయ్యారన్న వార్త ఇప్పుడు వైరల్‌ అవుతోంది.