ప్రేమపెళ్లి చేసుకుంటే గ్రామ బహిష్కరణ..

అమృత్‌సర్: పంజాబ్‌లో ప్రేమికులకు గడ్డుకాలమే. ప్రేమ, పెళ్లి అంటే సామాజిక బహిష్కరణ వేటుకు రెడీ అవుతున్నాయి గ్రామాలు. తాజాగా లుథియానా జిల్లాలో ఉన్న ఛాన్‌కోయిన్ గ్రామం సంచలన నిర్ణయం తీసుకుంది. తమ గ్రామంలో ప్రేమ పెళ్లిళ్లను నిషేధించింది. ఎవరైనా ప్రేమపెళ్లి చేసుకుంటే సామాజిక బహిష్కరణ వేటు వేస్తామని ప్రకటించింది. గ్రామంలో ఎవరూ వారితో మాట్లాడొద్దని.. వారికి సహకరించొద్దని ఆదేశించింది. ఇది తమ ఊళ్లోవాళ్లంతా కలిసికట్టుగా తీసుకున్న నిర్ణయమని.. దీనిలో తప్పేమి లేదని గ్రామపంచాయతీ సభ్యుడొకరు తెలిపారు.

గత నెల 29న గ్రామంలో ఓ కులాంతర వివాహం జరిగింది. దాన్ని సహించలేకపోయిన ఇతర గ్రామస్థులు.. తమ గ్రామంలో కులాంతర వివాహాలు తగవని తేల్చిచెప్పారు. అనంతరం జరిగిన గ్రామ పంచాయతీ సమావేశంలో ప్రేమపెళ్లిళ్లపై నిషేధం నిర్ణయం తీసుకున్నారు. దీనిపై జిల్లా అధికారులను ప్రశ్నిస్తే.. అలాంటివి ఏవీ తమ దృష్టికి రాలేదన్నారు. అయితే సామాజిక బహిష్కరణ నేరమని.. చట్టపరంగా వారిపై కేసులు నమోదు చేస్తామని తెలిపారు