ఫిఫా ఫైనల్లో ఆసక్తికర సన్నివేశం

ఫిఫా తుది సమరం ఆద్యంతం ఆకసక్తికరంగా సాగింది. ఫ్రాన్స్‌-క్రోయేషియా మధ్య ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో ఓ విచిత్ర ఘటన చోటుచేసుకుంది. తొలి అర్థబాగం వరకు 1-1తో సమంగా ఉన్న ఇరు జట్లు ఓ వైపు గోల్స్‌ కోసం పోటీ పడుతుండగా.. మరోవైపు మ్యాచ్‌ 53వ నిమిషంలో ఓ నలుగురు అభిమానులు ఆకస్మాత్తుగా మైదానంలోకి దూసుకొచ్చారు. దీంతో కొద్దిసేపు ఆటకు అంతరాయం కలిగింది. అయితే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది వారిని పట్టుకునే ప్రయత్నం చేయగా.. మైదానమంతా పరుగెత్తారు. అంతటితో ఆగకుండా అభిమాన ఆటగాళ్లకు హైఫై ఇచ్చే ప్రయత్నం చేశారు.

అయితే ప్రస్తుతం ఓ లేడీ అభిమానికి ఫ్రాన్స్‌ స్టార్‌ ప్లేయర్‌ ఎంబాపే హైఫై ఇచ్చిన పిక్‌ నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తోంది. అతనిపై అభిమానులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఎంబాపే అక్రమంగా మైదానంలోకి వచ్చిన అభిమానికి హైఫై ఇస్తే.. క్రొయేషియా ఢిఫెండర్‌ డేజన్‌ లోవెరన్‌ ఆ ప్రేక్షకులను పట్టుకోని సెక్యూరిటి సిబ్బందికి అప్పగించాడు. ఎంబాపెను ప్రశంసిస్తున్న అభిమానులు.. డేజన్‌ లోవెరన్‌పై మండిపడుతున్నారు. ఇక మైదానంలోకి దూసుకొచ్చిన ఆ నలుగురు ఒకే డ్రెస్‌కోడ్‌ ధరించడం విషేశం. ఆ నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.