ఫేస్‌బుక్ హీరోగా భారత ప్రధాని

జెనీవా, దిల్లీ: ఫేస్‌బుక్‌లో ఎక్కువమంది అనుసరించే ప్రపంచ నాయకుడిగా భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రికార్డు సృష్టించారు. 4.32 కోట్ల మంది ఆయన్ను ఈ సామాజిక అనుసంధాన వేదికపై అనుసరిస్తున్నారు. ట్విటర్‌ను ఏలే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ 2.31 కోట్ల మంది అనుచరులతో ఈ జాబితాలో రెండో స్థానంలో ఉన్నారు.‘ఫేస్‌బుక్‌లో ప్రపంచ నాయకులు’ పేరిట బర్సన్‌ కోన్‌ అండ్‌ వోల్ఫ్‌ (బీసీడబ్ల్యూ) సంస్థ ఈ జాబితాను విడుదలచేసింది. 650 మంది దేశాధిపతులు, ప్రభుత్వాధినేతలు, విదేశాంగ మంత్రులకు చెందిన ఫేస్‌బుక్‌ పేజీలను సంస్థ విశ్లేషించింది. గతేడాది జనవరి 1 నుంచి సమాచారాన్ని పరిశీలించింది. నివేదికలోని వివరాల ప్రకారం.
* గత 14 నెలల్లో ట్రంప్‌ ఫేస్‌బుక్‌ పేజీపై ఎక్కువ సంభాషణలు నమోదయ్యాయి. ఆయన పేజీలో వ్యాఖ్యలు, లైక్‌లు, షేర్‌ల మొత్తం సంఖ్య 20.49 కోట్లుగా ఉంది.మోదీ పేజీపై నమోదైన సంభాషణల(11.36 కోట్లు) కంటే రెట్టింపుగా ఉంది.

* ఇండోనేసియా అధ్యక్షుడు జాకో విడోడో, కాంబోడియా ప్రధాని శాండెక్‌ హున్‌ సేన్‌, అర్జెంటీనా అధ్యక్షుడు మరిసియో మక్రిల పేజీల్లోనూ వరుసగా 4.6, 3.6, 3.34 కోట్ల సంభాషణలు నమోదయ్యాయి.

* ఐరాస సభ్య దేశాల్లో 91 శాతం (175) దేశాలకు అధికారిక ఫేస్‌బుక్‌ పేజీలున్నాయి. దీనికి అదనంగా 109 మంది దేశాధిపతులు, 86 మంది ప్రభుత్వాధినేతలు, 72 మంది విదేశాంగ మంత్రులకు వ్యక్తిగత ఫేస్‌బుక్‌ పేజీలున్నాయి.

* 2018, మార్చి 15 నాటికి ప్రపంచ నాయకులందరి ఫేస్‌బుక్‌ పేజీల్లో అనుచరుల మొత్తం సంఖ్య 30.9 కోట్లుగా ఉంది. 2017, జనవరి 1 నుంచి మొత్తంగా వీరు 5,36,644 పోస్ట్‌లు చేశారు. వీటిపై 90 కోట్ల సంభాషణలు నమోదయ్యాయి.

* 2017లో ఎక్కువ మంది లైక్‌చేసిన ఫోటోల్లో ఐదింటినీ మోదీనే షేర్‌ చేశారు. ఒడిశాలోని ప్రఖ్యాత లింగరాజ్‌ దేవాలయ సందర్శన సమయంలో మోదీ తీసుకున్న ఫోటో ఎక్కువ మంది మెచ్చిన ఫోటోగా రికార్డు సృష్టించింది.