బలపరీక్షకు సిద్ధంకండి..సుప్రీంకోర్టు

యడ్యూరప్పకు బలపరీక్ష రేపే

కర్ణాటకలో రాజకీయ నాటకానికి రేపటితో తెరపడనుంది. ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప ప్రమాణస్వీకారాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్‌-జేడీఎస్‌ వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు శుక్రవారం విచారించింది. ఈ వ్యవహారం ఓ కొలిక్కి రావాలంటే రేపే బలపరీక్ష నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. భద్రతా కారణాల రీత్యా ఎమ్మెల్యేలు హాజరుకాని పక్షంలో డీజీపీకి తాము ఆదేశాలిస్తామని పేర్కొంది. శాసనసభలో ఎవరు బలాన్ని నిరూపించుకుంటే వారే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవచ్చని స్పష్టం చేసింది.

కాంగ్రెస్‌, జేడీఎస్‌ పిటిషన్‌పై ఈ ఉదయం 10.30గంటలకు విచారణ ప్రారంభించిన సుప్రీంకోర్టు.. ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయాలని కోరుతూ యడ్యూరప్ప గవర్నర్‌ను కోరిన లేఖలను సమర్పించాలని ఆదేశించింది. దీంతో భాజపా తరఫున వాదిస్తున్న ముకుల్‌ రోహత్గి ఆ లేఖలను కోర్టుకు అందించారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మెజార్టీ తమకు ఉందని, బలపరీక్షలో దీన్ని నిరూపించుకునేందుకు సిద్ధంగా ఉన్నామని రోహత్గి తెలిపారు. కాంగ్రెస్-జేడీఎస్‌కు చెందిన ఎమ్మెల్యేల నుంచి తమకు మద్దతు వస్తుందని, ఇంతకంటే ఏం చెప్పలేమన్నారు.

కాగా.. గవర్నర్‌ నిర్ణయంపై సుప్రీంకోర్టు ఒకింత ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారం తేలాలంటే రేపే బలపరీక్ష నిర్వహించాలని ఆదేశించింది. కోర్టు నిర్ణయానికి కాంగ్రెస్‌-జేడీఎస్‌ సైతం అంగీకరించాయి. ‘ గవర్నర్‌ ఎవర్ని పిలిచారు అన్నదాన్ని పక్కనబెడితే బలపరీక్షే దీనికి పరిష్కారం. శాసనసభలోనే బలాబలాలు తేలాలి. బలపరీక్ష రేపే నిర్వహించాలి’ అని న్యాయస్థానం ఆదేశించింది.

ఈ సందర్భంగా ఏజీ రోహత్గి స్పందిస్తూ.. బలపరీక్ష తమకు కొంత సమయం కావాలని న్యాయస్థానాన్ని కోరారు. అయితే ఇందుకు కోర్టు నిరాకరించింది. తాము ఎవరికీ సమయం ఇవ్వాలనుకోవడం లేదని… ఎట్టి పరిస్థితుల్లోనూ శనివారమే బలపరీక్ష నిర్వహించాలని తేల్చిచెప్పింది.