బస్సుల్లో వేలాడుతూ.. కత్తులతో విద్యార్థుల వీరంగం

నగరంలో కాలేజీ విద్యార్థులు చెలరేగిపోతున్నారు. కత్తులు ప్రదర్శిస్తూ.. ప్రమాదకరమైనరీతిలో బస్సులో ఫుట్‌బోర్డింగ్‌ చేస్తూ హల్‌చల్‌ చేస్తున్నారు. తాజాగా చెన్నైలోని రాజధాని కళాశాల విద్యార్థులు వీరంగం వేశారు. నడుస్తున్న బస్సులో వేలాడుతూ.. ప్రమాదకరరీతిలో కత్తులు ప్రదర్శించారు. అంతేకాకుండా బస్సులోని అమ్మాయిలను ఏడిపిస్తూ వెకిలీ చేష్టలకు పాల్పడ్డారు. విద్యార్థుల ఆకతాయి చర్యలతో బస్సులోని తోటి వాహనదారులు సైతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆకతాయిల భరతం పట్టేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. బస్సులో కత్తులతో హల్‌చల్‌ చేస్తున్న వారిని గుర్తించి.. వారి కోసం గాలిస్తున్నారు.