బిగ్‌బాస్ : శ్యామల, నూతన్‌ నాయుడు రీఎంట్రీ

బిగ్‌బాస్‌ సీజన్‌-2 ఏదైనా జరగొచ్చు.. అన్నట్లే ప్రేక్షకులకు బిగ్‌బాస్‌ బిగ్‌ ట్విస్ట్‌ ఇవ్వనున్నాడు. సీజన్‌-1 కన్నా సీజన్‌-2పై గత కొన్ని రోజులుగా సోషల్‌ మీడియాలో తీవ్ర చర్చ నడుస్తున్న విషయం తెలిసిందే. ఎపిసోడ్‌లు ప్రసారం కాకముందే హౌస్‌లో విషయాలు ముందే లీకైపోతున్నాయి. ఇది కొంత బిగ్‌బాస్‌కు తలనొప్పిగా మారినా.. వారికి కావాల్సిన హైప్‌ మాత్రం క్రియేట్‌ అవుతోంది. అయితే శనివారం ఎపిసోడ్‌లో హోస్ట్‌గా నాని ప్రవర్తించిన తీరు ప్రేక్షకులకు కొంత నిరాశకు గురిచేసినట్లు తెలుస్తోంది. చివర్లో ‘ఎన్నడూ రాని విధంగా ఈ వారం ఓట్లు పోటెత్తాయి.. ఇవి హౌస్‌లో ఉన్నవారి కోసం కాదు.. బయట ఉన్న మీ ఫేవరేట్‌ కంటెస్టెంట్‌ కోసం మీరు వేసిన ఓట్లు’ అని నాని ప్రకటించాడు.

అయితే గత వారం రోజులుగా హౌస్‌లోకి ఎవరు వెళ్తారని సోషల్‌ మీడియాలో తీవ్ర చర్చ జరిగింది. కంటెస్టెంట్స్‌ కూడా తమకు అనుకూలంగా ఓటెయ్యాలని క్యాంపయిన్‌ నిర్వహించారు. ఇక ఆదివారం ఉదయం నుంచే నూతన్‌ నాయుడు ఎంట్రీ ఇవ్వనున్నాడని అధికారికంగా తెలిసిపోయినట్లు విపరీతంగా ప్రచారం జరిగింది. అయితే ఇంకో విషయం ఏమిటంటే.. ఆయనతో పాటు యాంకర్‌ శ్యామల సైతం హౌస్‌లోకి వెళ్లినట్లు ప్రచారం జరిగింది. బిగ్‌బాస్‌ చరిత్రలోనే ఎన్నడూ రాని విధంగా ఓట్లు వచ్చాయని, నూతన్‌ నాయుడు, శ్యామలకు స్వల్ప ఓట్ల తేడా ఉండటంతో బిగ్‌బాస్‌ ఇద్దరికి అవకాశం ఇచ్చినట్లు సమాచారం ముందే లీకైంది. దీంతో ఆదివారం షోలో సస్పెన్స్‌ లేకుండానే ముగిసింది.

నూతన్‌ నాయుడుకి కౌశల్‌ ఆర్మీ మద్దతిస్తూ.. సోషల్‌ మీడియా వేదికగా ప్రచారం చేసిన విషయం తెలిసిందే. మరో పక్క శ్యామల సైతం తను ప్రేక్షకుల వల్ల ఎలిమినేట్‌ కాలేదని, హౌస్‌ మేట్స్‌కున్న ప్రత్యేక అధికారాల వల్లే అయ్యాననే విషయాన్ని ప్రేక్షకుల్లోకి బలంగా వెళ్లే ప్రయత్నం చేసింది. దీంతో ఆమెకు మద్దతు లభించింది. సో బయటకు లీకైన రూమర్స్‌నే నిజం చేస్తూ.. బిగ్‌బాస్‌లోకి శ్యామల, నూతన్‌ నాయుడు ఎంట్రీ ఇచ్చారు. అయితే వీరిద్దరు హౌజ్‌లో ఎప్పటినుంచి పాల్గొనబోతున్నారో బిగ్‌బాస్‌ డిసైడ్‌ చేయనున్నట్లు నాని తెలిపాడు.