బ్యాగులో అమౌంట్‌ చూసి దొంగలు షాక్‌!

Crime News

మామూలుగా దొంగలు చేసే పనికి సొమ్ము పోగొట్టుకున్న వాళ్లు షాక్‌ అవుతుంటారు. కానీ ఈ స్టోరీలో మాత్రం దొంగలకు తేరుకోలేని షాక్‌ తగిలింది. పక్కాగా ప్లాన్‌ చేసి దాదాపు 20-30 లక్షలకోసం ఎసరుపెడితే దొంగలకు మాత్రం కొసరు మాత్రమే మిగిలింది. దోచుకున్న బ్యాగులోని అమౌంట్‌ చూసి తేరుకునేలోపు 5 సంవత్సరాల జైలు శిక్షకూడా పడింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు… తూర్పు ఢిల్లీలోని సహ్‌దారా జిల్లాకు చెందిన ఓ 43ఏళ్ల వ్యాపారి వస్ర్తాల తయారీలో ఉపయోగించే ముడిసరుకును ఉత్పత్తి చేస్తుంటాడు. అదే ప్రాంతానికి చెందిన ఇఫ్తేకార్‌ ఖలీద్‌ ఆ వ్యాపారి వద్ద తరుచుగా ముడిసరుకును కొనుగోలు చేస్తూఉండేవాడు.

ఉన్నట్టుండి ఖలీద్‌కు ఓ రోజు దొంగబుద్ధి పుట్టింది. వ్యాపారి ప్రతిరోజూ బ్యాగులో లక్షల రూపాయలతో ఇంటికి వెళుతుంటాడని తెలుసుకుని ఎలాగైనా ఆ డబ్బు కొట్టేయ్యాలని ప్లాన్‌ వేశాడు. ఇందుకోసం నలుగురు మిత్రులను తోడుచేసుకొని కొన్నిరోజులపాటు రెక్కీలు నిర్వహించాడు. ఓ రోజు రాత్రి వ్యాపారి బ్యాగుతో స్కూటరుపై ఇంటికి వెళుతున్న సమయంలో బైకులపై వచ్చిన ఖలీద్‌ గ్యాంగ్‌ అతన్ని అడ్డగించింది. వ్యాపారి కళ్లల్లో కారం చల్లి, గాల్లోకి కాల్పులు జరిపి అతని బ్యాగును, స్కూటర్‌ను స్వాధీనం చేసుకున్నారు. అనుకున్న దాని ప్రకారం బ్యాగులో 25లక్షలు ఉంటే ఒక్కొక్కరికి 5లక్షల చొప్పున పంచుకుందామనుకున్నారు.

అందరూ ఆత్రుతగా బ్యాగును తెరిచి చూడగా.. ఒక్కసారిగా షాక్‌ గురైయ్యారు. ఊహించని మొత్తం… అక్షరాల ఐదు రూపాయలు బ్యాగులో దర్శనమిచ్చాయి. దీంతో ఏం చేయాలో తెలియక తలోదిక్కుకు పారిపోయారు. వ్యాపారి పోలీసులకు ఫిర్యాదు చేయటంతో వారు ముఠాలోని ఇద్దరిని అపుదులోకి తీసుకున్నారు. కోర్టులో నేరం నిరూపణ అవ్వటంతో వారికి 5సంవత్సరాల జైలు శిక్ష పడింది. పోలీసు అధికారి మేఘనా యాదవ్‌ మాట్లాడుతూ.. ‘‘వారికి దొంగతనం ఎలా చేయాలో కూడా తెలియదు. మొదటిసారి దొంగతనానికి వెళ్లటం వల్ల వాళ్లకు ఏం చేయాలో తెలియలేదు. దొంగతనం జరిగిన రోజు వ్యాపారి జేబులో 10వేల రూపాయలు ఉన్నాయి. వాళ్లు అతని జేబునుకూడా వెతకలేదు. స్కూటరు దొంగతనం అయితే చేశారు కానీ ఎక్కడ అమ్మాలో తెలియక దాన్ని పక్కన పడేశార’’ని అన్నారు.