భాజపా కర్ణాటక ఎన్నికల్లో ఎంత‌ ఖర్చు పెట్టిందో తెలుసా!

దర్యాప్తునకు కాంగ్రెస్‌ డిమాండు

కర్ణాటక ఎన్నికల్లో భాజపా రూ.6,500 కోట్లు ఖర్చు పెట్టిందని ఏఐసీసీ నాయకుడు ఆనంద్‌శర్మ ఆరోపించారు. ఒక్కో ఎమ్మెల్యే అభ్యర్థికి కనీసం రూ.20 కోట్లు పంచిపెట్టిందని, ఫలితాల తర్వాత ఎమ్మెల్యేల కొనుగోలు కోసం మరో రూ.4వేల కోట్లు కేటాయించిందని ధ్వజమెత్తారు. ఈ మొత్తం వ్యవహారంపై స్వతంత్ర సంస్థతో దర్యాప్తు జరిపించాలని డిమాండు చేశారు. సోమవారం ఆయన ఏఐసీసీ ప్రధానకార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన పార్టీ భాజపా అని, ఆ పార్టీకున్నంత పెద్ద కార్యాలయం ఏపార్టీకి లేదన్నారు. దేశంలో అన్నిపార్టీల ఆదాయంకంటే రెట్టింపు భాజపాకు ఉందని, అది ఎలా వచ్చిందో ప్రజలకు చెప్పాలన్నారు. నల్లధనంతో ఎన్నికల్లో పోరాడిన భాజపా నల్లధన వ్యతిరేక పోరాటం చేస్తున్నట్లు చెప్పుకోవడం సబబు కాదన్నారు. సోమవారం అమిత్‌షా విలేకరుల సమావేశం ఏర్పాటుచేస్తే కర్ణాటకలో చేసిన తప్పులకు దేశ ప్రజలకు క్షమాపణ చెబుతారని భావించామని, అందుకు విరుద్ధంగా తాము అపవిత్ర కలయికతో అధికారం ఏర్పాటు చేస్తున్నామని చెప్పడం సరికాదన్నారు. బిహార్‌ ప్రజలు ఆర్‌జేడీ, జేడీయూ, కాంగ్రెస్‌ కూటమికి ఓటేస్తే ఎన్నికల అనంతరం జేడీయూతో కలిసి భాజపా అధికారం చేజిక్కించుకోవడం పవిత్రమైన కలయికా? అని ప్రశ్నించారు. అతిపెద్దపార్టీకి ప్రభుత్వం ఏర్పాటుచేసే అవకాశం ఇవ్వాలని మాట్లాడుతున్న అమిత్‌షా గోవా, మణిపూర్‌, మేఘాలయలో అదే సూత్రం ఎందుకు వర్తింపజేయలేదని ఆనంద్‌శర్మ ప్రశ్నించారు.