భారీ వర్షాలు నీటిలో చిక్కుకున్న రైలు

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఒడిశా తీరంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత రెండు రోజుల నుంచి ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో రోడ్లన్ని జలమయమయ్యాయి. దీంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఆంధ్రా, ఓడిశా సరిహద్దుల్లో రహదారులకు సమాంతరంగా నాగావళి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. రాయఘడ జిల్లాలో కురిసిన భారీ వర్షానికి భువనేశ్వర్‌ నుంచి వెళ్లుతున్న హిరాఖండ్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు వరద నీటిలో చిక్కుకుపోయింది. రైల్వేస్టేషన్‌ సమీపంలో రైలు పట్టాలపైకి భారీగా వరద నీరు చేరింది. రైలు ముందుకు వెళ్లలేని పరిస్థితి ఉండటంతో నిలిపివేశారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. సింగిపురం, టికిరి స్టేషన్ల మధ్య మరో ట్రైన్‌, ఇంటర్‌సిటీ చిక్కుకోవడంతో ప్రయాణీకులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

కూలిన వంతెన
ఆంధ్రా ఒడిషా సరిహద్దుల్లో కురుస్తున్న భారీ వర్షాలకు నదులు పొంగి పొర్లుతున్నాయి. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు రాయగడ జిల్లా సులిపోదర గ్రామంలో గోడ కూలి భార్య భర్త మృతి చెందారు. మరో వైపు రాయఘడ జిల్లా జిమిడిపేట వద్ద వరద ఉధృతికి వంతెన కూలిపోయింది. భారీ ప్రవాహంలో కొట్టుకుపోయింది. పలుచోట్ల రైలు పట్టాల మీదుగా మూడు అడుగుల ఎత్తులో వరద ప్రవాహం ఉధృతంగా కొనసాగుతోంది.