భార్య, కుమార్తెను మంత్రగాడికి అప్పగించిన ఘనుడు

భార్యను, కుమార్తెను ఓ మంత్రగాడికి ఓ ప్రబుద్ధుడు అప్పగించాడు. ధర్మపురి జిల్లా దేవరాజపాళయంకు చెందిన మణి (60). ఈయన కోవైకు చెందిన యువతితో 2000 సంవత్సరంలో వివాహం జరిగింది. వీరికి 16 ఏళ్ల కుమార్తె, ఎనిమిదేళ్ల మరో కుమార్తె ఉన్నారు. మణి భార్య కోవై పోలీసులు కమిషనర్‌ కార్యాలయంలో మంగళవారం ఓ ఫిర్యాదు చేశారు.అందులో.. 2015 సెప్టెంబర్‌లో తన భర్త, ఆయన సోదరుడు దురైస్వామి, కుట్టిమణి అనే మంత్రవాదిని ఇంటికి తీసుకొచ్చారు. ఇంట్లో పరిహార పూజలు చేయాలని ఆ మంత్రవాది చెప్పాడు. తమ తోటకు సమీపంలో ఉన్న దిగుడు బావి వద్దకు తనను ఒంటరిగా తీసుకెళ్లారు. రాత్రంతా అక్కడ మంత్రగాడు కుట్టిమణి పూజలు చేశాడు.

ఆ సమయంలో అతడు తన తలపై, కడుపుపై ఏదో కాటుక లాంటిది పూశాడని, తర్వాత తనను బెదిరించి అత్యాచారం చేశాడని తెలిపారు. ఈ విషయాన్ని తన భర్తకు తెలుపగా పరువుపోతుందన్న ఆందోళనతో ఫిర్యాదు చేయడానికి నిరాకరించాడు. ఆ తర్వాత తన పెద్ద కుమార్తెను ప్రతి అమావాస్యకు పూజ పేరిట తీసుకు వెళ్లి అత్యాచారం చేశాడు. ఈ విషయాన్ని కుమార్తె తన వద్ద దాచిపెట్టింది. ఈ విషయంపై తాను భర్తతో గొడవ పడడంతో గత ఏడాది తనను భర్త 2016 పుట్టింటికి పంపించివేశాడు. ఆమె అన్నా, తమ్ముడు అందరూ కలసి తన వద్ద ఉన్న ఆరు సవర్ల బంగారు నగలను తీసుకుని ఇంటి నుంచి తరిమివేశారని ఫిర్యాదులో పేర్కొంది. తన, పిల్లల జీవితాన్ని నాశనం చేసిన భర్త, మంత్రవాదులపై చర్యలు తీసుకోవాలని కోరింది.