మంచి రోజులొస్తాయని వ్యభిచారం చేయమంది

భర్తతో వచ్చిన మనస్పర్థలు ఆమెను కన్నీరు కార్చేలే చేశాయి. ఐనవారు కదా..అని బంధువును అప్పు అడిగితే తన సోదరి కష్టాలు తీరుస్తుందని, ఆమెను నమ్ముకుంటే మంచిరోజులు వస్తాయని నమ్మించింది. అనంతరం ఆమెను వ్యభిచారకూపంలోకి దింపి క్యాష్‌ చేసుకుంది. రోజులు గడుస్తున్నా ఇంటికి రాని కుమార్తె గురించి తల్లి పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు నిందితులను అరెస్టు చేశారు.

ఒంగోలు మండలానికి చెందిన ఓ యువతిని మద్దిపాడు మండలానికి చెందిన యువకుడికి ఇచ్చి వివాహం చేశారు. దంపతుల మధ్య మనస్పర్థలు రావడంతో యువతి పుట్టింటికి చేరింది. అప్పటి నుంచి ఆమెకు కష్టాలు ప్రారంభమయ్యాయి. గ్రోత్‌సెంటర్‌లోని ఓ కుర్చీల ఫ్యాక్టరీలో కూలి పనికి చేరింది. అక్కడే సమీప బంధువైన మరో మహిళ కనపర్తి రమాదేవి తారసపడింది. తన కష్టాలు చెప్పుకొని బాధితురాలు కన్నీరు పెట్టుకుంది. ఒంగోలులో తన సోదరి ఉందని, అక్కడకు వెళ్తే కష్టాలు తీరతాయంటూ నమ్మబలికింది. బతుకు దెరువు కోసం వ్యభిచారం చేస్తే తప్పులేదంటూ మాయమాటలు చెప్పి ఆమెను ఆ రొంపిలోకి దించారు.

గుట్టు రట్టు ఇలా..
ఒంగోలు ఒన్‌టౌన్‌ పరిధిలోని ఓ ఇంట్లో తన కుమార్తె ఉందని బాధితురాలి తల్లి తెలుసుకుంది. వెంకటరత్నం అనే మహిళ వద్దకు వెళ్లి తన కుమార్తెను అప్పగించమని కోరింది. తాను రూ.20 వేలు వెచ్చించి కొనుగోలు చేశానని, కనీసం రూ.10 వేలు ఇస్తే తప్ప పంపనని వెంకటరత్నం మొండికేసింది. బాధితురాలిని ఆమె ఒంగోలులో కాకుండా తనతో సన్నిహిత సంబంధం కలిగి ఉన్న తిరుమలశెట్టి శ్రీనివాసులునాయుడు ద్వారా సింగరాయకొండకు చెందిన హరిబాబు అనే వ్యక్తి వద్దకు పంపింది. అక్కడ హరిబాబు ఆమెను వ్యభిచారం వృత్తిలోకి దింపాడు. పురుషులకు ఈమెతో మసాజ్‌తో పాటు ఇతర వికృత పనులు బలవంతంగా చేయించాడు. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు ఒన్‌టౌన్‌ పోలీసులు రంగంలోకి దిగి కేసు విచారించారు. రమాదేవితో పాటు యరజర్లకు చెందిన ఆటో డ్రైవర్‌ తిరుమలశెట్టి శ్రీనివాసులునాయుడు, కలికవాయి బిట్రగుంటకు చెందిన చేవూరి హరిబాబు, వెంకటరత్నంలను సీఐ ఫిరోజ్‌ అరెస్టు చేశారు.

Source : Click here