మరింత పదునెక్కిన బౌలింగ్‌ :గేల్‌

హైదరాబాద్‌: ఐపీఎల్‌-11లో తొలి 4 మ్యాచ్‌ల్లో మూడింట్లో నెగ్గిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ను ఓడించిన జట్టు కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ మాత్రమే! ఆ తర్వాత చెన్నై సూపర్‌ కింగ్స్‌ చేతిలోనూ ఓటమి ఎదురైనా.. సన్‌రైజర్స్‌ పరాజయాల బోణీ మాత్రం పంజాబ్‌తోనే మొదలైంది. ఆ జట్టుపై బదులు తీర్చుకునే అవకాశం ఇప్పుడు సన్‌రైజర్స్‌ ముందుంది. గురువారం ఉప్పల్‌ స్టేడియంలో జరిగే మ్యాచ్‌లో పంజాబ్‌తో సన్‌రైజర్స్‌ తలపడుతుంది. బౌలింగ్‌ మరింత పదునెక్కడంతో రెట్టింపు ఉత్సాహంతో ఉన్న సన్‌రైజర్స్‌.. ప్రతీకారం తీర్చుకుంటుందా? లేక క్రిస్‌ గేల్‌ తుఫాన్‌లో సన్‌రైజర్స్‌ కొట్టుకుపోతుందా?
జోరు కొనసాగేనా: ఇప్పటి వరకు ఆరు మ్యాచ్‌లాడిన సన్‌రైజర్స్‌ 4 విజయాలు.. 2 పరాజయాలతో పాయింట్ల పట్టికలో టాప్‌-3లో కొనసాగుతోంది. సొంతగడ్డపై చెన్నై చేతిలో ఓటమి తర్వాత కాస్త డీలాపడ్డ సన్‌రైజర్స్‌లో ముంబయిపై విజయం కొత్త ఉత్సాహం నింపింది. కేవలం 118 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకున్న తీరు అద్భుతం. బౌలర్లంతా సమష్టిగా సత్తాచాటి ప్రత్యర్థిని 87 పరుగులకే చుట్టేశారు. ప్రధాన బౌలర్‌ భువనేశ్వర్‌.. పేసర్‌ స్టాన్‌లేక్‌ గైర్హాజరీలోనూ సన్‌రైజర్స్‌ అద్భుతంగా రాణించడం విశేషం. పేసర్లు సందీప్‌శర్మ, సిద్ధార్థ్‌ కౌల్‌, బాసిల్‌ థంపి.. స్పిన్నర్లు మహ్మద్‌ నబి, షకిబ్‌ అల్‌ హసన్‌, రషీద్‌ఖాన్‌ కలిసికట్టుగా ప్రత్యర్థిని చిత్తుచేశారు. పంజాబ్‌తో మ్యాచ్‌లోనూ సన్‌రైజర్స్‌ అదే బౌలింగ్‌ కూర్పుతో బరిలో దిగే అవకాశాలే అధికం. ఐతే చెన్నైతో మ్యాచ్‌లో 183 పరుగుల లక్ష్యాన్ని ఛేదించినంత పనిచేసిన సన్‌రైజర్స్‌.. ముంబయితో మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో విఫలమైంది. గాయం నుంచి కోలుకుని తిరిగి జట్టులోకొచ్చిన ధావన్‌ విఫలమవడం.. మంచి ఆరంభాన్ని కెప్టెన్‌ విలియమ్సన్‌ భారీ ఇన్నింగ్స్‌గా మలచలేకపోవడం.. మిడిలార్డర్‌లో సాహా, మనీష్‌ పాండే, షకిబ్‌ చేతులెత్తేయడంతో సన్‌రైజర్స్‌ 120లోపు స్కోరుకే పరిమితమైంది. ముఖ్యంగా మిడిలార్డర్‌ నుంచి సన్‌రైజర్స్‌కు గుదిబండగా మారింది. మనీష్‌ పాండే, సాహాలు పెద్ద ఇన్నింగ్స్‌లు బాకీపడ్డారు. యూసుఫ్‌ పఠాన్‌, షకిబ్‌లలో మరింత నిలకడ అవసరం.

గేల్‌ ఏం చేస్తాడో!; కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ గురించి వివరించాలంటే క్రిస్‌ గేల్‌కు ముందు.. తర్వాత అని చెప్పాలేమో! ఈ సీజన్‌లో పంజాబ్‌ విజయాల్లో గేల్‌ పాత్ర అలాంటిది. ఆటగాళ్ళ వేలంపాటలో అన్ని ఫ్రాంచైజీలు ముఖం
చాటేయగా.. ఆఖరి రౌండ్లో పంజాబ్‌ అతడిని తీసుకుంది. గేల్‌ 2, 3 మ్యాచ్‌ల్లో సత్తాచాటినా అతనిపై పెట్టిన డబ్బులు వచ్చేసినట్లేనని పంజాబ్‌ మార్గనిర్దేశకుడు సెహ్వాగ్‌ కూడా అన్నాడు. ఐతే మొదటి 2 మ్యాచ్‌ల్లో రిజర్వ్‌ బెంచ్‌కే పరిమితమైన గేల్‌.. తర్వాతి మ్యాచ్‌ల్లో పరుగుల తుఫాన్‌ సృష్టిస్తున్నాడు. గేల్‌ ఆడిన మూడు మ్యాచ్‌ల్లో పంజాబ్‌దే గెలుపు. అతడిదే ముఖ్య భూమిక. 229 సగటుతో 229 రుగులు చేశాడు. అందులో ఒక సెంచరీ, రెండు అర్ధ సెంచరీలు ఉండటం విశేషం. ఈ సీజన్‌లో తొలి శతకం గేల్‌దే కావడం మరో విశేషం. గురువారం ఉప్పల్‌ స్టేడియంలోనూ గేల్‌ జోరు కొనసాగితే ఆతిథ్య జట్టుకు కష్టమే. ఇక గేల్‌ విధ్వంసంలోనూ జట్టుపై తనదైన ముద్ర వేసిన ఆటగాడు కేఎల్‌ రాహుల్‌. 6 మ్యాచ్‌ల్లో 236 పరుగులతో పంజాబ్‌ తరఫున అత్యధిక స్కోరు సాధించాడు. కరుణ్‌ నాయర్‌ మినహాయిస్తే మిగతా బ్యాట్స్‌మెన్‌ ఎవరూ ఫామ్‌లో లేకపోవడం పంజాబ్‌కు ప్రతికూలాంశం. మిడిలార్డర్‌లో యువరాజ్‌సింగ్‌ వైఫల్యం కొనసాగుతోంది. బౌలింగ్‌లో టై, కెప్టెన్‌ అశ్విన్‌, ముజీబ్‌ రహమాన్‌, మోహిత్‌శర్మలే పంజాబ్‌కు దిక్కు.

జట్లు (అంచనా): సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ : విలియమ్సన్‌ (కెప్టెన్‌), ధావన్‌, సాహా (వికెట్‌ కీపర్‌), మనీష్‌ పాండే, షకిబ్‌, యూసుఫ్‌ పఠాన్‌, రషీద్‌ఖాన్‌, బాసిల్‌ థంపి, సిద్ధార్థ్‌ కౌల్‌, సందీప్‌శర్మ, మహ్మద్‌ నబి/ బ్రాత్‌వైట్‌

కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌: అశ్విన్‌ (కెప్టెన్‌), కేఎల్‌ రాహుల్‌, గేల్‌, మయాంక్‌ అగర్వాల్‌, కరుణ్‌ నాయర్‌, ఫించ్‌, యువరాజ్‌, బరిందర్‌, టై, ముజీబ్‌, రాజ్‌పుత్‌