మహిళపై పెట్రోలు పోసి నిప్పంటించిన తల్లిదండ్రులు

కొడుకుతో సంబంధం పెట్టుకుందన్న అక్కసుతో ఆ యువకుడి తల్లిదండ్రులు ఒక యువతిపై పెట్రోలు పోసి నిప్పంటించారు. ఆమె చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. పోలీసుల కథనం ప్రకారం గురజనాపల్లికి చెందిన రాముల కుమారి కుమార్తె బొడ్డు మల్లేశ్వరికి నాలుగేళ్లు క్రితం రౌతులపూడి మండలం శృంగవరానికి చెందిన మోర్త అప్పారావుతో వివాహమైంది. వారికి రెండేళ్లు పాప ఉంది. కలహాలతో వారు ఏడాదిగా విడిగా ఉంటున్నారు. గురజనాపల్లిలో తల్లి రావుల కుమారి వద్ద ఆమె ఉంటోంది. జగన్నాథపురం రామారావుపేట చినమార్కెట్‌ ప్రాంతానికి చెందిన ఆటో డ్రైవర్‌ బొడ్డు గంగాద్రితో ఆమెకు సంబంధం ఏర్పడింది. గంగాద్రి తల్లిదండ్రులను వదిలి ఆమెతో నాలుగు నెలలు సర్పవరంలో సహజీవనం చేస్తున్నారు.

నాలుగు రోజుల క్రితం ఇద్దరూ గొడవ పడ్డారు. రెండేళ్ల బిడ్డను, తల్లిని తీసుకొని ఆమె అతడి ఇంటికి వచ్చింది. దీంతో అతడి తల్లిదండ్రులు బొడ్డు కామేశ్వరరావు, అమ్మాజీ వారిని బయట ఉండమని మల్లేశ్వరిని లోపలికి పిలిచారు. ఆమె గొడవ పడుతుండగా ఆగ్రహించిన అతడి తండ్రి ఆమెపై పెట్రోల్‌ను పోసి నిప్పు అంటించాడు. ఆర్తనాదాలతో కాలుతున్న ఆమె పరుగులు పెట్టడంతో స్థానికులు వారు గోనె సంచులు కప్పి ఆమె రక్షించారు. అప్పటికే 80 శాతానికి పైగా కాలిపోయిన ఆమెను 108 వాహనంలో కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనతో దివ్వాంగురాలైన ఆమె తల్లి నిస్సహాయురాలిగా ఉండిపోయింది. పోలీసులకు మల్లేశ్వరి వాంగ్మూలంగా ఇచ్చింది. కాలిన గాయాలతో ఉన్న ఆమెను కూతురు.. అమ్మాలే అమ్మా, వెళ్లిపోదామని అనడంతో పోలీసులతోసహ చూపరులను కలచివేసింది. ఈ సంఘటనపై ఒన్‌టౌన్‌ సీఐ సన్యాసిరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గంగాద్రి తల్లిదండ్రులు అమ్మాజీ, కామేశ్వరరావులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.