మహిళ స్ఫూర్తి కీ …జియో నెట్‌వర్క్‌!

ఈషా అంబానీ… మన దేశంలోనే ధనవంతుడైన ముఖేష్‌ అంబానీ కూతురని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కానీ ఆమె గురించి కాస్త ఆలోచిస్తే కుటుంబవ్యాపారంలో తన వంతు పాత్ర ఏంటో అర్థమవుతుంది. తొందర్లోనే పెళ్లి పీటలెక్కనున్న ఆమె గురించి మరికొన్ని ఆసక్తికర విషయాలివి…
మూడు సంవత్సరాల క్రితం భవిష్యత్తులో రాబోయే పన్నెండుమంది శక్తివంతమైన మహిళా పారిశ్రామికవేత్తల జాబితాలో ఈషా పేరు కూడా ఉంది. ఆమె ఆచరణకూ, ఆలోచనలకు ముందస్తు అంచనా అది. ఈషా రంగంలో దిగాక ఇది నిజమేనని నిరూపించుకుంది కూడా. ఆమె యేల్‌ యూనివర్సిటీ నుంచి సైకాలజీలో, సౌత్‌ ఏషియన్‌ స్టడీస్‌లో గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసింది. వెంటనే అదే సంవత్సరంలో న్యూయార్క్‌లోని ఒక ప్రముఖ కంపెనీలో బిజినెస్‌ అనలిస్ట్‌గా ఉద్యోగంలో చేరింది. దాన్ని భవిష్యత్తులో తను అందుకోబోతున్న బాధ్యతలకు సాన పెట్టుకునే అవకాశంగా మలుచుకుంది. కొన్ని రోజులు ఆ సంస్థలో పనిచేశాక, అదే ఏడాది అక్టోబర్‌ నెలలో ఈషానూ, ఆకాష్‌ను రిలయన్స్‌ రీటెయిల్‌, రిలయన్స్‌ జియోలో బోర్డు మెంబర్లుగా ముఖేష్‌ నియమించడం తెలిసిందే. జియో ఆలోచనలో వీళ్లిద్దరి పాత్ర కీలకమైంది. ‘జియో కంపెనీలో పనిచేసే ఉద్యోగుల సరాసరి వయసు ముప్ఫై కన్నా తక్కువే. ఆ బృందానికి నాయకత్వం వహించేది ఇంకా పాతిక సంవత్సరాలు కూడా నిండని నా కూతురూ, కొడుకు. ఇది యువతకోసం యువత నడిపిస్తున్న సంస్థ…’. 2016 సంవత్సరంలో జియో ప్రారంభ వేడుకలో ముఖేష్‌ అంబానీ అన్న మాటలివి. అలా పాతిక సంవత్సరాలు నిండక ముందే జియో బాధ్యతను నిర్వహించడం మొదలుపెపట్టింది ఈషా. నిర్వహణే కాదు… అత్యంత వేగంతో ఉన్న ఇంటర్నెట్‌ సదుపాయాన్ని ప్రారంభించాలన్న ఆలోచనకు బీజం వేసింది కూడా ఈషానే.

తండ్రికి చెప్పిందట…
ఆమె విదేశాల్లో చదువుకుని భారత్‌ వచ్చినప్పుడు ఇంటర్నెట్‌ వేగంలో ఉన్న సమస్యను వాళ్ల నాన్నతో చెప్పిందట. ఒక విధంగా మనదేశంలోనూ అలాంటి సదుపాయం కల్పించాలనే ఆలోచనకు నాంది పడిందక్కడే. జియో ఒక్కటే కాదు 2016 సంవత్సరంలోనే రిలయన్స్‌ సంస్థ తరఫున అజియో పేరుతో దుస్తుల కోసం ఆన్‌లైన్‌ వెబ్‌సైట్‌ను కూడా అందుబాటులోకి తెచ్చింది. దానికి సంబంధించిన పూర్తి నిర్వహణ బాధ్యత ఈషాదే. ప్రారంభించిన మొదటి ఏడాదిలోనే ఆ సంస్థ దేశం మొత్తంలో జరిగిన రీటెయిల్‌ లావాదేవీల్లో రెండు శాతం వాటా సొంతం చేసుకుంది. ‘నా చిన్నప్పటి నుంచి మా కుటుంబం మొత్తం రిలయన్స్‌ సంస్థ ద్వారా మెరుగైన సేవలు అందించేందుకే ప్రయత్నిస్తున్నారు. దాంట్లో నా బాధ్యత కూడా ఉండాలనుకున్నా. అది నా ధర్మం కూడా!’ అంటుందామె. ఈ బాధ్యతలన్నింటితో పాటే రిలయన్స్‌ ఫౌండేషన్‌ ద్వారా డిజిటల్‌ ఎడ్యుకేషన్‌ ప్రోగ్రాంనీ నిర్వహిస్తోంది. మనదేశంలో మారుమూల గ్రామాల్లో ఉన్న ఉపాధ్యాయులకు మెరుగైన విద్యాబోధనకు అవసరమయ్యే వనరులు కల్పిస్తున్నారు.

మహిళల సంఖ్య తక్కువే…
సైన్స్‌, టెక్నాలజీ రంగాల్లో మన దేశం దూసుకుపోతున్నా ఉద్యోగాలు చేస్తున్న మహిళా పురుషుల నిష్పత్తిలో మాత్రం విపరీతమైన తేడా ఉంటోంది. నాయకత్వం వహించే హోదాల్లో మహిళలైతే చాలా తక్కువే. ‘నేను తీసుకున్న ఈ బాధ్యత చాలా మంది మహిళలకు స్ఫూర్తి కావాలి. షెరిల్‌ శాండ్‌బర్గ్‌, పెప్సికో సీఈవో ఇంద్రానూయీ, లారెన్‌ పావెల్‌ జాబ్స్‌ ఈ రంగంలో నాకు స్ఫూర్తి ప్రదాతలు’ అనే ఈషా త్వరలో పిరమిల్‌ సంస్థల ఇంటికి కోడలిగా వెళ్లనుంది.