మాకు బోర్‌కొట్టినప్పుడు విడాకులు తీసుకుంటాం

దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌, విలక్షణ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీలది హిట్‌ పెయిర్‌. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘దేవ్‌ డీ’, ‘బ్లాక్‌ ఫ్రైడే’, ‘రామన్‌ రాఘవ్‌ 2.0’ మంచి విజయం సాధించాయి. ప్రస్తుతం అనురాగ్‌ కశ్యప్‌ తీసిన ‘సాక్రెడ్‌ గేమ్స్‌’ వెబ్‌ సిరీస్‌లో నవాజుద్దీన్‌ ప్రధాన ప్రాతలో నటించారు.

అయితే నవాజుద్దీన్‌తో కలిసి పనిచేయడం గురించి అనురాగ్‌ కశ్యప్‌ మాట్లాడుతూ.. ‘నేను చేసే పనిలో కొత్తదనం ఉంటేనే నవాజ్‌ను సంప్రదిస్తాను. ఇప్పటి వరకూ మేము చేసిన వాటిల్లో ఒక్కటి కూడా పునరావృతం కాలేదు. ఇప్పటి వరకూ మా ఇద్దరి కాంబినేషన్‌లో ఏం వచ్చాయి అనే దాని గురించి మాకు ఒక అవగాహన ఉంది. కొత్తగా చెప్పడానికి నా దగ్గర ఏం లేకపోతే ఖాళీగా ఉంటాను, తప్ప రొటీన్‌ ప్రాజెక్ట్‌లను ప్రారంభించను’ అన్నారు.

అంతేకాక.. ‘మా ఇద్దరి కాంచినేషన్‌ ఎంత కాలం కొనసాగుతుందో చెప్పడం కష్టం. మా ఇద్దరికి ఎప్పుడు బోర్‌ కొడితే అప్పుడు విడాకులు తీసుకుంటాం. కలిసి పనిచేయం’ అన్నారు. నవాజుద్దీన్‌ గురించి మాట్లాడుతూ ‘నవాజుద్దీన్‌ ఎంత గొప్ప నటుడో మొత్తం ఇండస్ట్రీకి తెలుసు. అతనికి తన పని అంటే ప్రాణం.. సినిమా కోసం ఎంతైనా కష్టపడతారు. ఇప్పుడు నేను నవాజుద్దీన్‌ను కొత్తగా చూపకపోతే నాకు, మిగితా వారికి తేడా ఉండదు.

ఈ పరిశ్రమలో నటులైన, సంగీత దర్శకులైన ఒక్కసారి విజయం సాధిస్తే ఇక మిగతా వారు కూడా వారిని అలానే చూపిస్తుంటారు. ఇక వారు జీవితాంతం అలాంటి పాత్రలకే పరిమితం అవ్వాల్సి వస్తుంది. నేను మాత్రం ఇలా చేయలేను. విసుగ్గా ఉంటుంది’ అన్నారు. అందుకే ‘అతన్ని ఒకే రకం పాత్రలకు పరిమితం చేయలేను’ అన్నారు.

స్వాతంత్ర్యానంతరం జరిగిన రాజకీయ పరిణమాలు ఫలితంగా మొదలైన ముంబై అండర్‌ వరల్డ్‌ ఇతివృత్తంగా ‘సాక్రెడ్‌ గేమ్స్‌’ వెబ్‌ సిరీస్‌ తెరకెక్కింది. ఈ వెబ్‌ సిరీస్‌లో సైఫ్‌ అలీఖాన్‌ సత్రాజ్‌ సింగ్‌ అనే నిజాయితి గల పోలీసాఫీసర్‌గా నటిస్తుండగా, నవాజుద్దీన్‌ సిద్దిఖి అండర్‌ వరల్డ్‌ డాన్‌ గణేష్‌ గేంతోడ్‌ పాత్రలో నటిస్తున్నారు.