మాట్లాడుతుండగా పేలిన సెల్‌ఫోన్‌

మండలంలోని ఎం.పైపల్లె పంచాయతీ జంగాలపల్లెలో సోమవారం మాట్లాడుతుండగా సెల్‌ఫోన్‌ పేలింది. గ్రామస్తుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన జితేంద్రరెడ్డి సెల్‌ ఫోన్‌లో మాట్లాడుతుండగా ఒక్కసారిగా వేడెక్కింది. కొద్ది క్షణాల్లోనే పొగలు రావడంతో అతను జాగ్రత్త పడి దాన్ని దూరంగా పెట్టాడు. చూస్తుండగానే అది పేలిపోయింది. బాధితుడు లబోదిబో మంటూ స్థానిక పోలీసులను ఆశ్రయించాడు. వారి సలహా మేరకు చిత్తూరులోని సెల్‌ ఫోన్‌ సర్వీసు సెంటరులో ఫిర్యాదు చేశాడు. సెల్‌ఫోను కొనుగోలు చేసి ఆరునెలలు కూడా పూర్తి కాలేదని జితేంద్రరెడ్డి తెలిపాడు. రూ.12 వేలకు ఆన్‌లైన్‌లో మొబైల్‌ కొనుగోలు చేశానన్నాడు. చూస్తుండగానే పేలిపోయిందని, త్రుటిలో ప్రాణాపాయం తప్పిందని వాపోయాడు.