మా కాలంలోనూ అదే టార్చర్‌!

ఇప్పుడు ఏ నోట విన్నా కాస్టింగ్‌ కౌచ్‌ మాటే. అంతకు ముందు అణగారి ఉన్న ఈ అంశం గాయని సుచిత్ర, తాజాగా నటి శ్రీరెడ్డిల కారణంగా కలకలం సృష్టిస్తోంది. ఏ నటితో మాట్లాడినా మీడియా కాస్టింగ్‌ కౌచ్‌ గురించి ప్రశ్నించడం ఒక ఆనవాయితీగా మారింది. కొందరు భామలు తమ అభిప్రాయాలను ధైర్యంగానే వెల్లడించే ప్రయత్నం చేస్తుండడం విశేషం. ఇటీవల నటి మీనాకు ఇలాంటి ప్రశ్నే ఎదురైంది. మీనా తమిళం, తెలుగు భాషల్లో స్టార్‌ హీరోలందరితోనూ నటించేసింది. ముఖ్యంగా కోలీవుడ్‌లో సూపర్‌స్టార్‌ రజనీకాంత్, కమలహాసన్‌ వంటి వారితోనూ జత కట్టింది. ఇంకా ఎవరితోనైనా నటించాలని కోరుకుని నటించలేకపోయిన నటులెవరైనా ఉన్నారా అన్న ప్రశ్నకు మీనా బదులిస్తూ నటడు అరవిందస్వామి సరసన నటించలేకపోయాను. రోజా చిత్రం సమయంలో ఆయనకు చాలా క్రేజ్‌ ఉంది. ఆ సమయంలో అరవిందస్వామికి జంటగా నటించే అవకాశం వచ్చినా కాల్‌షీట్స్‌ సమస్య కారణంగా ఆ అవకాశాన్ని వదులుకున్నాను. అలాంటి అవకాశాన్ని మిస్‌ చేసుకున్నానేమోనని ఇప్పటికీ అనిపిస్తోంది. అదే విధంగా విజయ్‌తో చాలా చిత్రాలు కమిట్‌ అయి కూడా నటించడం కుదరలేదు.

తెరి చిత్రం షూటింగ్‌ సమయంలో విజయ్‌ ఇదే విషయాన్ని ప్రస్తావించారు. కావాలనే నాతో నటించడానికి నిరాకరించారు కదూ అని వెంటనే అప్పట్లో మీ డైరీ గురించి నాకు తెలుసు ఊరికే సరదాగా అన్నాను అని నవ్వేశారు. అయితే విజయ్‌తో నటించలేదన్న కొరత పోవడానికే షాజహాన్‌ చిత్రంలో ఆయనతో ఒక పాటలో నటించాను. ఇక అవకాశాలు వచ్చి నేను మిస్‌ చేసుకున్న చిత్రాల పట్టిక చాలానే ఉంది. ఫ్రెండ్స్‌ (దేవయాని పాత్ర), ప్రిముడన్‌(కౌసల్య పాత్ర), వాలి(సిమ్రాన్‌ పాత్ర), దేవర్‌మగన్‌ (రేవతి పాత్ర), పడైయప్పా (రమ్యకృష్ణ పాత్ర), పొన్‌మణి(సౌందర్య పాత్ర) చిత్రాల కథలను విని అందులో నేను నటించలేకపోయిన పరిస్థితి. ఇక ప్రస్తుతం కలకలం చెలరేగుతున్న కాస్టింగ్‌ కౌచ్‌ గురించి అడుగుతున్నారు. అది చాలా విచారకరమైన విషయం. అన్ని రంగాల్లోనూ మహిళలకు సమస్యలు ఉన్నాయి. అలాంటి సంఘటనలను నేను ఎదుర్కోకపోయినా, మా కాలంలోనూ ఆ టార్చర్‌ ఉండేది. వక్ర బుద్ధి కలిగిన మగాళ్లు ఇకనైనా మారాలి. వారు ఒక స్త్రీతో డీల్‌ మాట్లాడే ముందు తమకు భార్య, పిల్లలు ఉన్నారన్నది గుర్తు చేసుకోవాలి. ప్రతిభను ప్రదర్శించే అవకాశాల కోసం ఎలాంటి సామరస్యానికి చోటు లేకుండా స్త్రీలు పోరాడాలి అని నటి మీనా పేర్కొంది.