మా సినిమా టీజర్‌ను డిస్‌లైక్ చేయండి..

వ‌ర్మ‌ వార్నింగ్‌..

జనసేన చీఫ్‌ పవన్‌ కల్యాణ్‌ను టార్గెట్‌ చేస్తూ దర్శకుడు రాంగోపాల్‌ వర్మ ట్వీట్లబాణాలు వదిలారు. అక్కినేని నాగార్జున హీరోగా రూపొందిన ‘ఆఫీసర్‌’సినిమా టీజర్‌కు డిస్‌లైక్స్‌ భారీగా రావడంపై వర్మ గడిచిన కొద్ది గంటలుగా వరుస ట్వీట్లు చేశారు. ఇంకా ఇంకా డిస్‌లైక్స్‌ కొట్టి పవన్‌ ఫ్యాన్స్‌ తమ సత్తా చూపించాలని, ఓ అభిమానిగా.. నాగార్జున, ఆఫీసర్ల తరఫున ఈ మేరకు పవన్‌ ఫ్యాన్స్‌కు, జనసేనకు వార్నింగ్‌ ఇస్తున్నట్లు వర్మ రాసుకొచ్చారు.

‘‘11 కోట్ల మంది తెలుగు ప్రజల్లో పవన్‌ అభిమానుల సంఖ్య 11 వేలేనా? ఓ అభిమానిగా నేనే షాకవుతున్నా. మా సినిమా టీజర్‌ను ఇంకా వేలమంది డిస్‌లైక్‌ చేసి.. అభిమానుల సంఖ్య ఇంత తక్కువ కాదని నిరూపించాలి. ఇది.. నాగార్జున-ఆఫీసర్‌ తరఫున పీకే ఫ్యాన్స్‌కు నా వార్నింగ్‌. జనసేన పార్టీ కూడా ఈ (11 వేల మందే అన్న) విషయాన్ని సీరియస్‌గా తీసుకోవాలి. లేకుంటే ఇదీ ప్రజారాజ్యం పార్టీలా డిజాస్టర్‌ అవుతుంది’’ అని వర్మ పేర్కొన్నారు.

నాగార్జున-వర్మ కాంబినేషన్‌లో రూపొందిన ‘ఆఫీసర్‌’ సినిమా మే 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవలే విడుదలైన రెండో టీజర్‌కు లైక్స్‌తో సమానంగా డిస్‌లైక్స్‌ రావడం గమనార్హం. కూడబలుక్కొనిమరీ పవన్‌ ఫ్యాన్స్‌ డిస్‌లైక్స్‌ కొడుతున్నారన్న వర్మ.. ఆమేరకు కొందరి పోస్టులను ఉటంకించారు. శ్రీరెడ్డి ఉదంతం, అనంతర పరిణామాల్లో పవన్‌.. ఘాటు హెచ్చరికలు, వరుస ట్వీట్ల తర్వాత గడిచిన కొద్దిరోజులుగా కవ్వింపు చర్యలేవీలేవు. వర్మ ట్వీట్లపై పవన్‌గానీ, జనసేనగానీ ఇప్పటిదాకా స్పందిచలేదు.