ముంబై సారధి రోహిత్‌ శర్మ తీవ్ర అసంతృప్తి

మూడుసార్లు ఐపీఎల్‌ టైటిల్‌ వినర్స్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్‌ ఈ సీజన్‌లో మాత్రం చతికలబడింది. ముంబైలో గొప్ప ఆటగాళ్లు ఉన్నప్పటికీ.. ఇప్పటి వరకు ఆడిన 8 మ్యాచ్‌ల్లో కేవలం రెండింటిలో మాత్రమే విజయం సాధించి.. పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో నిలిచింది. మంగళవారం రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఓటమి పాలైన సంగతి తెలిసిందే. అయితే ఈ ఓటమిపై ముంబై సారధి రోహిత్‌ శర్మ తీవ్ర అసంతృప్తి వెల్లడించారు. తమ జట్టు ఆటతీరుపై ఆయన తీవ్ర నిర్వేదం వ్యక్తం చేశారు.

దీనిపై ఆయన మాట్లాడుతూ.. ‘ఈ మ్యాచ్‌లో ఓటమి తీవ్రంగా బాధిస్తుంది. దీనికి మమ్మల్ని మేమే నిందిచుకోవాల్సి ఉంటుంది. పవర్‌ ప్లేలో వికెట్లు కోల్పోవడం మ్యాచ్‌ని దెబ్బతీసింది. బెంగళూరు జట్టు అద్భుతంగా బౌలింగ్‌ చేసింది’ అని అన్నారు. ఈ మ్యాచ్‌లో రోహిత్‌ గోల్డెన్‌ డక్‌గా పెవిలియన్‌ చేరాడు. అంతకు ముందు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై కేవలం 87 పరుగులు చేయడంపై కూడా రోహిత్‌ ఇదే రకమైన వ్యాఖ్యలు చేశారు.