యువతీ, యువకులకు బుద్ధొచ్చే విధంగా… ట్రాఫిక్ కఠిన చ‌ర్య‌లు

చిత్తుగా మద్యం తాగి ఆ మత్తులో వాహనాలు నడుపుతూ ప్రమాదాలు చేస్తున్న యువతీ, యువకులపై ట్రాఫిక్‌ పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఒక్కసారి చిక్కినా సరే…జైలుకు పంపుతున్నారు. ఇందుకోసం డ్రంకెన్‌ డ్రైవింగ్‌ తనిఖీలను ముమ్మరం చేశారు. మద్యంమత్తులో నడిపే వాహన చోదకులని చట్టపరిధిలో కఠినంగా శిక్షిస్తే తప్ప .. వారికి బుద్ధొచ్చే అవకాశం లేదని ఉన్నతాధికారులు భావించారు. తొలిసారే జైలుకు పంపితే… తదుపరి మద్యం తాగి వాహనం నడపబోరన్న అంచనాతో.. కఠినంగా శిక్షించాలంటూ న్యాయస్థానాన్ని అభ్యర్థిస్తున్నారు. ట్రాఫిక్‌ పోలీసుల అభ్యర్థనలు… తాగి నడుపుతూ చేసిన ప్రమాదాల తీవ్రతను పరిశీలిస్తున్న మెజిస్ట్రేట్‌లు జైలుశిక్షలు విధిస్తున్నారు.

మీట నొక్కితే వివరాలన్నీ…
దీంతోపాటు పోలీసులకు చిక్కిన ప్రతి ఒక్కరి వివరాలనూ ట్యాబ్‌లో నమోదు చేస్తున్నారు. నాలుగైదుసార్లు దొరికిన వారి వివరాలూ ఒక్క మీట నొక్కడంతో తెరపై ప్రత్యక్షమవుతున్నాయి. ఇకవారి ఆధార్‌ నంబరు, వాహనం వివరాలు పోలీసు రికార్డుల్లో నమోదు చేస్తుండటంతో … రెండోసారి దొరికితే జైలు శిక్షతో పాటు అదనంగా డ్రైవింగ్‌ లైసెన్స్‌ రద్దు చేయిస్తున్నారు. ఈ ఏడాది తొలి మూడు నెలల్లో 6,950 మందిపై కేసులు నమోదు చేయగా… 1,310 మంది జైలుకు వెళ్లారు.. 539 మంది డ్రైవింగ్‌ లైసెన్సులు రద్దయ్యాయి.
శిక్షకు అర్హులంటూ నివేదిక…
అతిగా తాగి వాహనాలు నడపకూడదన్న భావన చోదకుల్లో కలిగేలా… న్యాయస్థానానికి ప్రమాదాల తీవ్రత తెలిసేలా… పోలీస్‌ ఉన్నతాధికారులు కొద్ది నెలల నుంచి కొత్తపంథాను అనుసరిస్తున్నారు. తాగి చిక్కిన వారి వివరాలను కంప్యూటరీకరిస్తే రెండు, మూడోసారి దొరికిన వారిని తేలిగ్గా గుర్తించవచ్చని నిర్ధరించుకున్నారు. డ్రంకెన్‌ డ్రైవ్‌ నిర్వహిస్తున్నప్పుడు ట్యాబ్‌తో ఫొటో తీయడంతో పాటు వెంటనే దాన్ని కంట్రోల్‌రూంకు పంపించేందుకు వీలుగా… ట్యాబ్‌లో త్రీజీ నెట్‌వర్క్‌ సిమ్‌ను పొందుపరిచారు. అప్పటి నుంచి పూటుగా మద్యం తాగి వాహనాలు నడిపిన ప్రతి వ్యక్తి వివరాలు ఫొటోతో సహా కమాండ్‌ కంట్రోల్‌లో నిక్షిప్తమయ్యాయి. రెండు లేదా అంతకుమించి ఎక్కువసార్లు దొరికితే వారి వివరాలతో న్యాయస్థానంలో నివేదికను ఇస్తున్నారు. తద్వారా జైలు శిక్ష విధించేందుకు అర్హులంటూ అందులో నివేదిస్తున్నారు. దొరికిన వారి రక్తంలో ఆల్కహాల్‌ శాతం వివరాలను పేర్కొంటూ వారి ప్రవర్తనను అభియోగ పత్రాల్లో వివరిస్తున్నారు.