రాష్ట్ర వ్యాప్తంగా రవాణా శాఖ అధికారుల తనిఖీలు

రాష్ట్ర వ్యాప్తంగా స్కూల్ బస్సులపై రవాణా శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఏపీలోని 13 జిల్లాల్లో ఉదయం నుంచి రవాణాశాఖ ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తోంది. డీటీసీ మీరా ప్రసాద్ ఆధ్వర్యంలో విజయవాడలోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద బస్సులను తనిఖీలు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 152 బస్సులపై కేసులు నమోదుచేయగా.. వాటిలో 125 బస్సులను రవాణాశాఖ అధికారులు సీజ్ చేశారు. ఈ సందర్భంగా డీటీసీ మీరా ప్రసాద్ మాట్లాడుతూ.. స్కూల్ బస్సుల ఫిట్‌నెస్ విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక డ్రైవ్ కొనసాగుతోందని తెలిపారు.

రవాణాశాఖ మంత్రి, కమిషనర్‌ల ఆదేశాల మేరకు ఆకస్మిక తనిఖీలు కూడా చేస్తున్నామని చెప్పారు. ఫిట్‌నెస్ లేని బస్సులను సీజ్ చేస్తున్నామన్నారు. విద్యార్థులను తరలించే ప్రైవేట్ వాహనాలు, ఆటోలను కూడా తనిఖీ చేస్తున్నామని వెల్లడించారు. స్కూల్ బస్సులతో పాటు అందరూ రవాణాశాఖ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని విజ్ఞప్తి చేశారు.